అనంతపురం ప్రతినిధి : తీవ్రమైన కరువు పరిస్థితుల్లోనున్న రైతాంగానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు హామీనిచ్చారు. 'బాబు ష్యూరిటీ-భవిష్యత్ గ్యారెంటీ' యాత్ర మంగళవారం అనంతపురం జిల్లాలో ప్రారంభమైంది. మూడు రోజులపాటు జిల్లాలో జరిగే ఈ యాత్రలో చంద్రబాబు పాల్గొంటున్నారు. మంగళవారం ఉదయం విమానంలో బళ్లారి చేరుకున్న చంద్రబాబు అక్కడ కమ్మ జనసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఓబుళాపురం చెక్‌పోస్టు మీదుగా అనంతపురం జిల్లాలోకి ప్రవేశించారు. పల్లేపల్లి వద్ద వర్షాభావంతో దెబ్బతిన్న వేరుశనగ పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి రైతులతోనూ మాట్లాడారు. వర్షాభావంతో వేరుశనగ పంట ఏ మాత్రం వచ్చే అవకాశం లేదని రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. పంట దెబ్బతిన్నా బీమా సరిగా రావడం లేదు. పురుగు మందులు, ఎరువుల ధరలు పెరిగిపోయాయని చంద్రబాబు దృష్టికి రైతులు తీసుకొచ్చారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు అండగా ఉంటామని ఆయన భరోసానిచ్చారు. అనంతరం సాయంత్రం రాయదుర్గం పట్టణంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. అంతేకాకుండా స్థానికంగానున్న సమస్యలను ఎత్తిచూపారు. భైరవానితిప్ప ప్రాజెక్టు ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాంతానికి నీరివ్వాలని ఆనాడు తెలుగుదేశం పార్టీ రూ.907 కోట్లతో పనులు చేపడితే దీన్నిఈ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. అదే విధంగా ఉంతకల్లు రిజర్వాయర్ నిలిపివేసారని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే వీటిని తప్పకుండా పూర్తి చేస్తామని హామీనిచ్చారు. పంటలు ఎండిపోతే తాము అధికారంలోనున్న సమయంలో బీమా,ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకున్నామన్నారు. ఈ ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీనే ఎత్తివేసిందన్నారు. ఉచిత బీమా పెేరుతో రైతులకు పరిహారం సక్రమంగా అందకుండా చేస్తోందన్నారు. బీమా విధానంలో మార్పులు తీసుకొస్తామని హామీనిచ్చారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఇక్కడున్న నేతలు కూడా ఇసుక, మైనింగ్ అన్నింటిలోనూ దోచుకుంటున్నారని ఆరోపించారు. వేదవతి నదిలో ఇసుక ఉన్న ఇక్కడి ప్రజలకు దొరకడం లేదని తెలిపారు. బళ్లారి, బెంగళూరులో ఇక్కడి ఇసుక దొరుకుతోందన్నారు. వైఎఎస్.జగన్మోహన్‌రెడ్డి సైకో పాలన వలన రాష్ట్రం అధోగతి పాలైందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అప్పుల మయం చేసారని ఆరోపించారు. మద్యం నియంత్రించే ఎన్నికల్లో ఓటు అడుగుతామని ప్రతిపక్షంలో ఉండగా చెప్పారని గుర్తు చేశారు. నియంత్రించకపోగా మద్యం అమ్మకాలపై రూ.14 వేల కోట్లు అప్పు తెచ్చారని చెప్పారు. జాబ్ క్యాలెండర్ అని ప్రకటించి ఉద్యోగ భర్తీ చేయేలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీనిచ్చారు. విద్యుత్ ఛార్జీల భారాన్ని మోయలేనంతగా ఈ ప్రభుత్వం వేస్తోందన్నారు. సంక్షేమం పేరుతో రూ.10 ఇచ్చి రూ.100 దోచేస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రానికి రాజధాని అన్నది కూడా లేకుండా చేసారని మండిపడ్డారు. పోలవరంను పూర్తిగా నాశనం చేశాడని ఆరోపించారు. రాష్ట్రంలో రాబోయే ఆరు నెలల్లో ఏర్పడబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమేనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాలలో టిడిపి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టిడిపిని గెలిపిస్తే రాయదుర్గం నియోజకవర్గం, రాయలసీమను అపర శ్రీకష్ణదేవరాయల వలె చంద్రబాబు నాయుడు అన్ని రంగాల్లోనూ అభివద్ధి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు పరిటాల సునీత, బికె.పార్థసారథి, పరిటాల శ్రీరామ్, ఎమ్మెల్సీ రామ్‌గోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి, ఆలం నరసానాయుడు పాల్గొన్నారు.
నేడు బాబు పర్యటన
చంద్రబాబు రెండో రోజు పర్యటన ఈ విధంగా సాగనుంది. ఉదయం 11.30 గంటలకు రాయదుర్గంలోని పీజీ కళాశాల వద్ద నుంచి బయలుదేరి 12.30 గంటలకు కౌకుంట్లకు చేరుకుంటారు. అక్కడ పయ్యావుల కేశవ్ కుమారుడు వివాహ రిసెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి కళ్యాణదుర్గం పయనమవుతారు. సాయంత్రం 4.15 గంటలకు కళ్యాణదుర్గంలోని వాల్మీకి సర్కిల్‌కు చేరుకుంటారు. అక్కడ వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేస్తారు. అనంతరం టీ సర్కిల్‌కు చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొన్నారు. రాత్రి అక్కడే బస చేస్తారు.










