ప్రజాశక్తి - దేవనకొండ
రైతు సంక్షేమ, అభివృద్ధికి వైసిపి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఉపాధి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ తెలిపారు. సోమవారం మండలంలోని జిల్లేడుబుడకల, మాదాపురం, ఓబులాపురం గ్రామాల్లో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రి గుమ్మనూరు జయరామ్ హాజరయి ఆయా గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధి గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు విత్తనాలు, ఎరువుల కోసం ఇబ్బందులు పడకుండా ఉండడానికి సచివాలయంలో రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. రైతు సంక్షేమానికి ప్రతేడాది పంటల బీమా, రైతు భరోసా కింద పరిహారం అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. జిల్లేడుబుడకల ఎస్సీ కాలనీలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను మార్చాలని, సిసి రోడ్డు, డ్రెయినేజీ కాలువలు నిర్మించాలని, మాదాపురం గ్రామంలో తాగునీటి సమస్య తీర్చాలని ఆయా గ్రామాల ప్రజలు మంత్రికి విన్నవించారు. అందుకు స్పందించిన మంత్రి సచివాలయానికి మంజూరయ్యే నిధులతో వాటిని పూర్తి చేయిస్తామన్నారు. పత్తికొండ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సిఐ రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐ భూపాలుడు బందోబస్తు నిర్వహించారు. సొంత గ్రామంలో ఆస్పరి మాజీ జడ్‌పిటిసి బొజ్జమ్మ, దేవనకొండ మాజీ ఎంపిపి రామచంద్ర నాయుడు 'గడపగడపకు' హాజరు కాకపోవడం గమనార్హం. గుమ్మనూరు సోదరులు శ్రీనివాసులు, నారాయణస్వామి, జడ్‌పిటిసి కిట్టు, ఎంపిపి లక్ష్మీదేవి భర్త లుమాంబ, వైసిపి మండల కన్వీనర్ కప్పట్రాళ్ల మల్లికార్జున, వైసిపి మండల నాయకులు మోహన్ రెడ్డి, ప్రేమ్ నాథ్ రెడ్డి, నారాయణరెడ్డి, దివాకర్ నాయుడు, ఎల్‌కె.శీను, రామచంద్ర, కొత్తపేట బాబు, దస్తగిరి, కౌలుట్ల పాల్గొన్నారు.
గ్రామస్తులతో మాట్లాడుతున్న మంత్రి గుమ్మనూరు










