ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : రైతుభరోసా కేంద్రాలలో సిబ్బంది అందుబాటులో ఉంటూ నాణ్యమైన సేవలు రైతులకు అందించాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సలహా మండలి సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఏ. రమణారెడ్డి, జెడ్‌పి చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల సిబ్బందితో మండల జిల్లా స్థాయి లలో ప్రతినెల తప్పనిసరిగా సమావేశాలు నిర్వహించాలన్నారు. రైతులకు మేలు జరిగే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్న ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఆర్‌బికెల్లో వ్యవసాయ ఉధ్యానవన ఇతర క్షేత్రస్థాయి సహాయకులు అందుబాటులో ఉండాలన్నారు. రైతులకు అవసరమైన మామిడి, సపోటా, చీనీ తదితర మొక్కలు అందించాలన్నారు. అగ్రి అడ్వైజరీ చైర్మన్ రమణారెడ్డి మాట్లాడుతూ తాము జిల్లాలోని 32 మండలాల్లోని ఆర్‌బికెలను తనిఖీ చేస్తూ రైతు సమస్యలు తెలుసుకుంటున్నామన్నారు. కొన్నిచోట్ల ఆర్‌బికెలు అద్దె భవనాల్లోఉంటున్నాయని శాశ్వత భవనాలు నిర్మించాలని కోరారు. జెడ్పీ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ రైతుల పక్షపాతిగా ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారు. వేసవిలో రైతులు భూసార పరీక్షలు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. పలు ఆర్‌బికెలలో సిబ్బంది కొరత ఉందని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు, ఉద్యానవన శాఖ అధికారి చంద్రశేఖర్, సిరికల్చర్ జెడి పద్మమ్మ, మార్కెటింగ్ అధికారి నరసింహమూర్తి, కదిరి వ్యవసాయ ప్రధాన శాస్త్రవేత్తలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.










