ప్రజాశక్తి - కదిరి టౌన్ : దేశానికి అన్నం పెట్టే రైతాంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విస్మరిస్తున్నాయని రైతు సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ గిరీష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న, జిల్లా కార్యదర్శి బడా సుబ్బిరెడ్డి విమర్శించారు. కదిరిలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బడా సుబ్బిరెడ్డి అధ్యక్షతన రైతు సంఘాల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు హనుమంతు రెడ్డి, ప్రధాన కార్యదర్శి జేవీ రమణ,రైతు సంఘం నాయకులు వివి రమణ ఎస్వీ రమణ శివన్న శ్రీరాములు శంకర్ రెడ్డి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేటుకు అండగా నిలబడుతూ పచ్చని పంటలు పండించే భూములను తక్కువ ధరకు అప్పనంగా కట్టబెడుతున్నాయని విమర్శించారు. కార్పొరేట్ కంపెనీలు ప్రోత్సహించడంతోపాటు రైతాంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల పండించిన పంటలకు మద్దతు ధరలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేస్తే చివరకు దిగుబడి మద్దతు ధర లేక విలవిలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అన్ని రకాల అప్పులు మాఫీ చేయాలని, రైతుల పండించిన పంటకు గిట్టుబాటు ధర చట్టబద్ధత చేయాలని కోరారు. విద్యుత్ ప్రైవేట్ కరణ బిల్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పాడి పశువుల రైతులకు ఇన్సెంటివ్ అందజేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. పాడి రైతులకు సబ్సిడీ రుణాలు అందించాలని ,కూరగాయలు సాగు చేసే రైతులకు సబ్సిడీతో విత్తనాలు ఎరువులు, ట్రేలు, డ్రిప్పు పరికరాలు అందించాలని కోరారు. భూ యజమానుల నిమిత్తం లేకుండా కౌలు రైతులకు హక్కుల పత్రాలు అందించాలన్నారు. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలని ముంపు రైతులకు న్యాయమైన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.










