Jul 07,2023 20:02

కలెక్టరేట్‌ వద్దకు ర్యాలీ నిర్వహిస్తున్న టిడిపి నాయకులు

       పుట్టపర్తి అర్బన్‌ : జిల్లాలో పంటలు నష్టపోయిన రైతాంగానికి ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, పంటల బీమా ఇవ్వకుండా వైసిపి ప్రభుత్వం మోసం చేసిందని టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతుకూ పూర్తి స్థాయి ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ టిడిపి ఆధ్వర్యంలో శుక్రవారం నాడు కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. గణేష్‌ కూడలి నుంచి కలెక్టరేట్‌ వరకు టిడిపి శ్రేణులు ర్యాలీగా చేపట్టాయి. అక్కడ బైఠాయించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షులు బికె.పార్థసారథి, మాజీ మంత్రులు పల్లె రఘునాథ్‌ రెడ్డి, పరిటాల సునీత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలో లేనప్పుడు జగన్‌రెడ్డి రైతాంగాన్ని ఆదుకుంటామని అనేక హామీలు ఇచ్చారన్నారు. అధికారం చేపట్టాక నాలుగేళ్లలో రైతులకు ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. కరువు జిల్లా అయిన సత్యసాయి జిల్లాలో 32 మండలాలు ఉంటే 14 మండలాలకు అరకొర వాతావరణ బీమా మంజూరు కాగ, మిగతా 18 మండలాల రైతులకు మొండి చేయి చూపించారన్నారు. ఉద్యానవన పంటలకు కూడా బీమా ఇవ్వలేదన్నారు. ఎకరాకు 20 వేలు నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని అన్నారు. గతంలో అసెంబ్లీ ఉమ్మడి జిల్లాకు రావాల్సిన వేరుశనగ పంటలకు రూ.960 కోట్లు, ఉద్యానవన పంటలకు రూ.360 కోట్లు ఇస్తామని జగన్‌ హామీ ఇచ్చారన్నారు. నాలుగేళ్లు అవుతున్నా ఈ నష్టపరిహారం ఇవ్వడానికి జగన్‌కు చేతులు రావడం లేదన్నారు. టిడిపి హయాంలో బీమాతో పాటు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలు అందించామని గుర్తు చేశారు. రైతులను ఆదుకోకుండా ఏ ముఖం పెట్టుకుని జగన్మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లా పర్యటనకు వస్తున్నారని చెప్పాలని నిలదీశారు. ఉమ్మడి జిల్లాల రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని, లేకుంటే అన్నదాతల ఆగ్రహానికి ఈ ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర కార్యదర్శి సవితమ్మ, నాయకులు సాలక్కగారి శ్రీనివాసులు, పట్టణ కన్వీనర్‌ రామాంజనేయులు, సామకోటి ఆదినారాయణ, మహమ్మద్‌ రఫీ తదితరులు పాల్గొన్నారు.