Jul 18,2023 20:51

ఆవాజ్‌ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష, మద్దతుగా పాల్గొన్న సిపిఎం, టిడిపి, కాంగ్రెస్‌, ప్రజా సంఘాల నాయకులు

రైల్వే గేట్‌ కమ్మీలు తొలగించాలి
- సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్‌ కుమార్‌
- ఆవాజ్‌ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష
- టిడిపి, కాంగ్రెస్‌, ప్రజా సంఘాల నాయకులు మద్దతు
ప్రజాశక్తి - నంద్యాల

     నంద్యాల పట్టణంలోని నూనెపల్లె ప్లై ఓవర్‌ బ్రిడ్జి వద్ద రైల్వే గేట్‌ కమ్మీలు తొలగించి పాదచారులకు ఇబ్బంది లేకుండా చూడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. నూనెపల్లె రైల్వే గేట్‌ కమ్మీలు తొలగించాలని కోరుతూ ఆవాజ్‌ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలో ఎస్‌.మస్తాన్వలి, బాబుల, బబ్లు కూర్చున్నారు. ఈ దీక్షలను సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్‌ కుమార్‌ ప్రారంభించారు. దీక్షలకు టిడిపి నాయకులు, రాష్ట్ర విత్తనాభివృద్ధి స0ంస్థ మాజీ చైర్మన్‌ ఏవి. సుబ్బారెడ్డి, అబ్దుల్‌ సమ్మదు, అబులైసు, ప్రజాస్వామ్య లౌకిక ఐక్యవేదిక నాయకులు, ఎస్సైడి.ప్రసాద్‌, చింతలయ్య, మస్తాన్‌ ఖాన్‌, కాంగ్రెస్‌ నాయకులు మహబూబ్బాషా, జాన్‌జాగో నాయకులు సలాం మౌలానా, ఐఎంఎల్‌ నాయకులు రామరాజు, జెవివి నాయకులు వాసు తదితరులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆవాజ్‌ కమిటీ చేసే పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు. వెంటనే రైల్వే గేట్‌ కమ్మీలు తొలగించాలన్నారు. ఎంపీ ప్రజల సౌకర్యం కోసం కాకుండా తన శ్రేయస్సు కోసం, తన వ్యాపార అభివద్ధి కోసం ఆలోచన చేస్తున్నారని తెలిపారు. గేట్‌ కమ్మీలు తొలగించడానికి చేతగాని ఎంపీ ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. అండర్‌ గ్రౌండ్‌ బ్రిడ్జి నిర్మాణం కావాలంటే ఇంకా ఆరు నెలలు పడుతుందని, అంతవరకు ఈ ప్రాంత ప్రజలందరూ అనేక విధాలుగా ఆర్థికంగా నష్టపోతారని తెలిపారు. నంద్యాల వారే కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా పాదచారులు రైల్వే గేట్‌ మార్గాన నంద్యాలకు, వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారని తెలిపారు. ప్రజలకే కాకుండా ఆటో వాళ్ళు, వ్యాపార సంస్థలు, హౌటల్లు, ఫ్యాక్టరీలకు వెళ్లే కార్మికులు, కలెక్టర్‌ ఆఫీస్‌కు, ఇతర ఆఫీసులకు వెళ్లే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులందరూ నష్టపోతారని చెప్పారు. ఆవాజ్‌ కమిటీ జిల్లా కార్యదర్శి మస్తాన్వలి మాట్లాడుతూ ఎంపీ ఇప్పటికైనా రైల్వే జిఎంతో మాట్లాడి కమ్మీలు తొలగించాలని డిమాండ్‌ చేశారు. పట్టణ అధ్యక్షుడు బాబుల మాట్లాడుతూ రైల్వే గేట్‌ కమ్మీలు తొలగించకుంటే అన్ని ప్రజా సంఘాలు కలుపుకొని పోరాడుతామని, అప్పటికి దిగి రాకపోతే కమ్మీలు తామే తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారు.