Oct 18,2023 19:54

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బీవీ

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రాయలసీమ ద్రోహి అని మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బీవీ.జయ నాగేశ్వర్‌ రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాయలసీమ బిడ్డనని చెప్పి రాయలసీమకు న్యాయ రాజధాని చేస్తామని చెప్పి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తున్నామని ప్రగల్భాలు పలికారని గుర్తు చేశారు. హైకోర్టు ఎక్కడ జగన్మోహన్‌ రెడ్డి అని ప్రశ్నించారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మిగనూరు, కర్నూలు పర్యటనకు వచ్చినప్పుడు న్యాయరాజధాని వస్తుంటే అడ్డు పడుతున్నారని నల్లజెండాలు పట్టుకొని నిరసన తెలిపిన పేటీఎం బ్యాచ్‌ ఎక్కడ అని నిలదీశారు. ఒకవైపు 'అప్పర్‌ భద్ర' ప్రాజెక్టు కట్టి రావాల్సిన నీటి వాటాను, మరోవైపు కృష్ణానది నుంచి రావాల్సిన నీటి వాటాను కొట్టేస్తుంటే వారికి వత్తాసు పలుకుతూ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నది ఎవరని ప్రశ్నించారు. గాజులదిన్నె ప్రాజెక్టు ఎత్తు పెంచి నీటి నిల్వలను పెంచుతామని చెప్పి నేటి వరకు ఏం చేశారని మండిపడ్డారు. టిడిపి హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జిల్లాలోని ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, కోడుమూరు, కర్నూలు నియోజకవర్గాలను సస్యశ్యామలం చేయాలని చంద్రబాబు నాయుడు ద్వారా రూ.2 వేల కోట్లతో మంజూరు చేయించిన ఆర్‌డిఎస్‌ను పూర్తి చేశారా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో చేనేతలు, నిరుద్యోగులకు లబ్ధి చేకూర్చాలని మంజూరు చేసిన టెక్స్‌టైల్స్‌ పార్కును పూర్తి చేశారా అని నిలదీశారు. రూ.145 కోట్లతో మంజూరు చేసిన గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి పైపులైన్‌ పనులను పూర్తి చేశారా అని ప్రశ్నించారు. ఎర్రబాడు గ్రామంలో ముస్లిం, మైనారిటీ ఆడబిడ్డను అత్యాచారం చేసి హత్య చేశారని, మూడేళ్లయినా ఆ కుటుంబానికి న్యాయం చేయలేదని తెలిపారు. టిడిపి హయాంలో కట్టిన జిం3 ఇళ్లను సైతం ఇంతవరకు లబ్ధిదారులకు పంపిణీ చేయలేదని తెలిపారు. పాలన చేతకాక అధికార వైఫల్యాలను ఎండగడుతున్న ప్రతిపక్షాలపై కక్ష కట్టి తప్పుడు కేసులు పెట్టి జైళ్లలో పెట్టి సైకో మాదిరి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పర్యటనలో నల్లజెండాలు, ఫ్ల కార్డుల రూపంలో నిరసన తెలియజేస్తామని చెప్పారు. తాము ముఖ్యమంత్రి పర్యటనకు వ్యతిరేకం కాదని, ఎమ్మిగనూరు, రాయలసీమకు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. నాయకులు సుందర్‌ రాజు, దయాసాగర్‌, రాందాస్‌ గౌడ్‌, గురు రాజ్‌ దేశాయి, నారాయణరెడ్డి, తిరుపతయ్య నాయుడు, బేతాళ బడేసాహెబ్‌, మైనార్టీ నాయకులు తురేగల్‌ నజీర్‌ అహ్మద్‌, కటారి రాజేంద్ర పాల్గొన్నారు.