May 30,2023 21:40

రైతులు ధాన్యం తడవకుండా కప్పిన పట్టలు

రాయితీ 'పట్ట'లకు మంగళం
- వైసిపి ప్రభుత్వంలో నాలుగేళ్లుగా జాడే లేని వైనం
- గత టిడిపి హయాంలో 50 శాతంపై పంపిణీ
ప్రజాశక్తి - చాగలమర్రి

     ఇటీవల అకాల వర్షాలు కురిశాయి. ఆరబెట్టిన ధాన్యాలు, మొక్కజొన్న పంటలు తడిసిపోకుండా కాపాడుకోవడానికి అన్నదాతలు నానా అగచాట్లు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తమ వద్ద ఉన్న పాత చిరిగిపోయిన టార్పాలియన్‌ పట్టలు కప్పి రక్షణ కల్పించేందుకు ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. ధాన్యం తడిసిపోయి తీవ్రంగా నష్టపోయారు. మరికొందరు రైతులు అద్దెకు పట్టలు దొరుకుతాయేమోనని పరుగులు పెట్టినా ఫలితం శూన్యం. టార్పాలియన్‌ పట్టలు లేక చాలా నష్టపోయామని, ధాన్యం, మొక్కజొన్న పంట తడిసి రంగు మారిపోయిందని రైతులు విలవిల్లాడారు.
చాగలమర్రి మండలంలో అధికంగా వరి, పత్తి, మొక్కజొన్న, జొన్న, కంది పంటలు పండిస్తారు. ఖరీఫ్‌ సీజన్‌ చివరి రోజుల్లో వర్షాలు బాగా కురుస్తున్నాయి. కళ్ళాల్లో ధాన్యంతో పాటు ఇతర పంటలు తడిసిపోతున్నాయి. రాత్రివేళ టార్పాలియన్లు కప్పి పగటివేల తొలగిస్తుంటారు. దీనివల్ల మంచు, వర్షం నుంచి కాపాడుకుంటారు. నూర్పిడి తరువాత ధాన్యం ఆరబెట్టుకునే సమయంలో వర్షాలు వస్తే నష్టపోకుండా టార్ఫాలియన్లు కాపాడతాయి. మొక్కజొన్న పండించే రైతులు కూడా వర్షాలు వచ్చినప్పుడు పట్టల మీద ఆధారపడతారు. ఇంత అవసరం ఉన్న పట్టలను ప్రభుత్వం రాయతీ మీద నాలుగేళ్లుగా ఇవ్వడం లేదు. వరుస వర్షాల నేపథ్యంలో పట్టలను రైతులు కొనుగోలు చేసుకోక తప్పలేదు. నాణ్యత పరిమాణాన్ని బట్టి రూ. 4 నుంచి 10 వేల వరకు అధికంగా ఖర్చు పెట్టక తప్పలేదు.
రాయితీకి వైసిపి ప్రభుత్వం మంగళం
అకాల వర్షాలు కురిసిన సమయాల్లో పంట ఉత్పత్తులు తడవకుండా కాపాడుకోవడానికి రైతులకు పట్టలు(టార్ఫాలియన్లు) అత్యంత అవసరం. పంట దిగుబడులు చేతికి వచ్చే దశలో వర్షాలు పడితే ఈ పట్టలకు విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. దీనిని గుర్తించిన గత ప్రభుత్వం 50 శాతం రాయితీపై రైతులకు పంపిణీ చేసేది. వైసిపి అధికారంలోకి వచ్చాక రాయితీపట్టలకు మంగళం పాడింది. దీంతో రైతులు బహిరంగ మార్కెట్లో అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం రాయితీ మీద పంపిణీ చేయకపోవడంతో తయారీదారులు ధరలు పెంచి విక్రయిస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కర్షకులు అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. చాగలమర్రి మండలంలో ఇటీవల వర్షాలకు ధాన్యాన్ని కోసి ఆరబెట్టిన పంటలను రక్షించుకోవడానికి ఒక్కొక్కరు సుమారు పది వేల రూపాయలకు పైగా వీటి కోసం వెచ్చించామని రైతులు చెబుతున్నారు.
అదనపు భారం
ఖరీఫ్‌ రబీ సీజన్లో పంట ఉత్పత్తులను ఆరుబయట ఉంచినప్పుడు వర్షం, మంచు నుంచి కాపాడుకోవడానికి ప్రతి రైతుకూ పట్టలు అవసరం. తుఫాన్లు, వాయుగుండాలు ఏర్పడినప్పుడు పంట చేజారిపోకుండా టార్పాలిన్ల ద్వారా కాపాడుకుంటారు. అనుకోకుండా వచ్చే వర్షాల సమయంలో పంట ఉత్పత్తులు ఆరబెట్టే ప్రాంతంలోనే పట్టలు సిద్ధంగా ఉంచుకుంటారు. అంత కీలకమైన పట్టలను ప్రభుత్వం రాయతీపై అందించి ఆదుకోవాల్సి ఉంది. కానీ అందుకు విరుద్ధంగా ప్రస్తుత ప్రభుత్వం నాలుగేళ్లుగా రైతులకు పట్టలను పంపిణీ చేయకుండా వారిపై అదనపు భారం పడేలా చేస్తోంది. ఇక ముందైనా ప్రభుత్వం టార్ఫాలియన్ల రాయితీ పథకాన్ని ప్రభుత్వం పునరుద్దంచాలని రైతులు కోరుతున్నారు. దీనిపై మండల వ్యవసాయ అధికారి రంగ నేతాజీని వివరణ కోరగా రాయితీ టార్ఫాలిన్ల పథకం నాలుగేళ్లుగా ఆగిపోయిందన్నారు. ప్రభుత్వం పునరుద్ధరిస్తే తప్ప రైతులకు అందించలేమని చెబుతున్నారు. మరి రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న వైసిపి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతుందా లేదో చూడాల్సిందే..

 

పొలాల్లో ధాన్యం తలవకుండా పట్టలు కప్పిన దశ్యం
ధాన్యం తడవకుండా కప్పిన పట్టలు