Sep 06,2023 23:09

చంద్రబాబుతో కాలవ శ్రీనివాసులు

      రాయదుర్గం : 2024 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాయదుర్గం నియోజకవర్గం అభ్యర్థిగా కాలవ శ్రీనివాసులు ఉంటారని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బుధవారం నాడు రాయదుర్గంలోని రాయల్‌ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ విషయం తెలిపారు. ఈ సమావేశంలో వ్యక్తమైన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ తమ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు రాయదుర్గం అభ్యర్థిగా ఉంటారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్నారు. రాయదుర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు అభ్యర్థిగా ఉంటారని రకరకాల ఊహగానాలకు చంద్రబాబు ప్రకటనతో తెరపడింది. ఇటీవల రాయదుర్గం అభ్యర్థిగా గుణపాటి దీపక్‌ రెడ్డి ఉంటారని, కాలవ శ్రీనివాసులు గుంతకల్లు, కళ్యాణదుర్గం అసెంబ్లీ లేదా అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా వెళ్తారనే ప్రచారం ఉండేది. చంద్రబాబు ప్రకటనతో ఈ ఊహాగానాలకు తెరదించినట్లు అయ్యింది.