ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : జియమ్మ వలస మండలం రావాడ రామభద్రపురం గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల హెచ్‌ఎంగా విధులు నిర్వహిస్తున్న ఎన్.తిరుపతి విశాఖపట్నంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతులు మీదుగా రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు, రూ.20వేలు నగదు బహుమతి అందుకున్నారు. మరోవైపు ఇదే పాఠశాలలో డ్రాయింగ్ టీచర్‌గా పని చేస్తున్న రుగడ శ్రీనివాసరావు కలెక్టర్ నిశాంత్ కుమార్ చేతుల మీదుగా జిల్లా స్థాయి అవార్డు అందుకున్నారు. ఓకే పాఠశాల నుంచి ఇద్దరు ఉపాధ్యాయులకు ఉత్తమ అవార్డులు రావడం పట్ల ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.
వీరఘట్టం : మండలంలోని చిట్టిపూడివలస మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న సాకేటి రాంబాబుకు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక కావడంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు అందుకున్నారు. దుస్సాలులతో ఘనంగా సన్మానించి గోల్డ్ మెడలతో మెమెంటు, సర్టిఫికెట్ అందజేశారు.
రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రిన్సిపల్ గా మంజులవీణ
సాలూరు: జిల్లా డివిఇఒ, మక్కువ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మంజులవీణ రాష్ట్ర స్థాయి ఉత్తమ ప్రిన్సిల్‌గా అవార్డు అందుకున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతులు మీదుగా ఆమె అవార్డు అందుకున్నారు. ఆమెకు అవార్డు రావడం పట్ల పలువురు ఉపాధ్యాయులు, అధ్యాపకులు హర్షం వ్యక్తంచేశారు.
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా కెవి సత్యనారాయణ
జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కెవి సత్యనారాయణ అవార్డు అందుకున్నారు. సత్యనారాయణకు జిల్లా అవార్డు లభించడం పై ఎపిటిఎఫ్ మండల,పట్టణ నాయకులు,ఉపాద్యాయులు హర్షం వ్యక్తంచేశారు.










