Jun 08,2023 20:01

పోటీలను ప్రారంభిస్తున్న ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, డాక్టర్‌ రామకృష్ణారెడ్డి, చిత్రంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ రవికృష్ణ, ఆంధ్ర చెస్‌ సంఘం అధ్యక్షులు కెవివి శర్మ తదితరులు

రాష్ట్రస్థాయి చెస్‌ పోటీలు ప్రారంభం
ప్రజాశక్తి - నంద్యాల

       నంద్యాల పట్టణంలోని రామకృష్ణ పిజి కళాశాల ఆడిటోరియంలో ఆంధ్ర చెస్‌ సంఘం ఆధ్వర్యంలో జిల్లా సంఘం నిర్వహణలో గురువారం అండర్‌-19 ఫిడే ర్యాంకింగ్‌ రాష్ట్రస్థాయి ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్‌ ఘనంగా ప్రారంభమైంది. చెస్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ రవికృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ జి.రామకృష్ణారెడ్డి, ఆంధ్ర చెస్‌ సంఘం అధ్యక్షులు కెవివి.శర్మ పాల్గొని టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ చదరంగం మెదడుకు పదును పెడుతుందని తెలిపారు. ఈ క్రీడ వలన బాలలలో మానసిక వికాసం కలుగుతుందని చెప్పారు. చెస్‌ క్రీడను విద్యార్థులకు పాఠ్యాంశంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. డాక్టర్‌ జి.రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నంద్యాలలో చెస్‌ పోటీలు తరచూ నిర్వహించడం అభినందనీయమని, చెస్‌ జిల్లా సంఘం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ర్యాంకింగ్‌ రాష్ట్ర స్థాయి చెస్‌ టోర్నమెంట్‌ తమ కళాశాలలో నిర్వహించడం సంతోషకరమన్నారు. కెవివి.శర్మ మాట్లాడుతూ జువనైల్‌ జైల్లో ఉన్న బాలలకు, అనాధ బాలల వసతి గృహాలలో రాష్ట్రవ్యాప్తంగా చదరంగం క్రీడలో ఉచిత శిక్షణ కార్యక్రమాలు చేపట్టబోతున్నామని తెలిపారు. ఈ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్రం తరఫున జాతీయస్థాయి చెస్‌ పోటీలలో పాల్గొంటారని ప్రకటించారు. డాక్టర్‌ రవికృష్ణ మాట్లాడుతూ ఈ పోటీలలో రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొంటున్నారని, నాలుగు రోజులపాటు జరుగుతాయని తెలిపారు. అనంరం కెవివి.శర్మను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా క్రీడా ప్రాదేశిక అధికారి నరసింహారాజు, ఆంధ్ర రాష్ట్ర చెస్‌ సంఘం సంయుక్త కార్యదర్శి రామసుబ్బారెడ్డి, రోటరీ క్లబ్‌ అధ్యక్షులు డాక్టర్‌ అనిల్‌ కుమార్‌, లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు చంద్రమోహన్‌, కార్యదర్శి కూరా ప్రసాద్‌, కోశాధికారి రత్నకుమార్‌, లైన్స్‌ క్లబ్‌ ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ సుధాకర్‌ రెడ్డి, వైసిపి నాయకులు సోమశేఖర రెడ్డి, కర్నూల్‌ చెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గోవింద జీయర్‌, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా మాజీ అధికారి శేషి రెడ్డి, నిర్వాహకులు ఇమామ్‌, క్రీడాకారులు పాల్గొన్నారు.