Aug 29,2023 19:58

ఇసుక రీచ్‌ వద్ద నిరసన తెలియజేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - కౌతాళం
ఇసుకను అక్రమ తరలించి వైసిపి నాయకులు రూ.వేల కోట్లు దోచుకుంటున్నారని టిడిపి మంత్రాలయం ఇన్‌ఛార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం కౌతాళం మండలం గుడికంబాలి గ్రామంలో ఇసుక రీచ్‌ వద్ద నిరసన చేపట్టారు. ఇసుక అక్రమ రవాణాకు వ్యతిరేకంగా నినదించారు. తిక్కారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో ఆదోని ఇన్‌ఛార్జీ మీనాక్షి నాయుడు, ఎమ్మినూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బీవీ.జయనాగేశ్వర్‌ రెడ్డి, పత్తికొండ ఇన్‌ఛార్జీ కెఇ.శ్యాంబాబు, పరిశీలకులు శివబాల, సబితమ్మ పాల్గొని మాట్లాడారు. జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి రాకముందు కొత్త ఇసుక పాలసీ అంటూ ప్రజలను మభ్యపెట్టారని, అధికారంలోకి రాగానే ఇసుక దొరకకుండా చేశారని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేయడం వల్ల కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో ఎక్కడికక్కడ ఇసుక రీచ్‌లను నెలకొల్పి స్థానిక ఎమ్మెల్యేలు, వైసిపి నాయకులు ఇసుకను అక్రమంగా పక్క రాష్ట్రాలకు తరలిస్తూ భారీగా ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రజాధనం దోపిడీకి గురి కావడమే కాకుండా ప్రజలకు ఇసుక దొరకకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి స్పందించి ఇసుక అక్రమ రవాణాపై విచారణ చేపట్టాలని కోరారు. వచ్చే 2024 ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రాగానే పాత విధానాన్ని అమలులోకి తీసుకొచ్చి అందరికీ ఇసుక దొరికే విధానాన్ని కొనసాగిస్తామని తెలిపారు. అనంతరం ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కౌతాళం ఎస్‌ఐ నరేంద్ర కుమార్‌ రెడ్డికి ఫిర్యాదు చేశారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్‌ రెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంత్‌ రెడ్డి, తెలుగు యువత కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్‌ రెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడ్‌, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప, తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటపతి రాజు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కోట్రేష్‌ గౌడ్‌, కోసిగి మండల కన్వీనర్‌ జ్ఞానేష్‌, బీసీ సీనియర్‌ నాయకులు వక్రాణి వెంకటేశ్వర్లు, నాడిగేని అయ్యన్న, నాడిగేని రంగన్న, చావిడి వెంకటేశ్వర్లు, రమేష్‌ గౌడ్‌, బీసీ సాధికార రాష్ట్ర సభ్యులు కురువ మల్లికార్జున, బీసీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షులు మాధవరం అమర్‌నాథ్‌ రెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డి, వాణిజ్య విభాగం జిల్లా ఉపాధ్యక్షులు భరద్వాజ్‌ శెట్టి, కౌతాళం నాయకులు టిప్పు సుల్తాన్‌, కురుగోడు, రహిమాన్‌, రాజానందు, రాజబాబు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు
సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు