Sep 13,2023 22:17

సాలూరులో దీక్షలు చేస్తున్న టిడిపి నాయకులు జి.సంధ్యారాణి, ఆర్‌పి భంజ్‌దేవ్‌, తదితరులు

ప్రజాశక్తి-సాలూరు : రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు జి.సంధ్యారాణి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్‌పి భంజ్‌దేవ్‌ ధ్వజమెత్తారు. టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా బుధవారం జిల్లాలో పలు చోట్ల టిడిపి ఆధ్వర్యాన రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సాలూరు పట్టణంలోని బోసుబొమ్మ జంక్షన్‌లో రిలే దీక్షలు చేపట్టారు. చంద్రబాబు అరెస్టుకి నిరసనగా పురోహితునివలస గ్రామానికి చెందిన టిడిపి నాయకులు తురాయిల సత్యం గుండు గీయించుకున్నారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ 14 ఏళ్లు సిఎంగా పనిచేసిన చంద్రబాబునాయుడు అవినీతి మచ్చలేని నాయకుడిగా ప్రజల మన్ననలు పొందారని అన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబను సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అరెస్టు చేయించారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో వైసిపికి తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల అధ్యక్షులు ఆముదాల పరమేష్‌, పిన్నింటి ప్రసాద్‌బాబు, జి.వేణుగోపాల్‌, నాయకులు సిహెచ్‌.తవిటినాయుడు, మాజీ కౌన్సిలర్‌ ఎ.అప్పయ్యమ్మ పాల్గొన్నారు. కురుపాంలో టిడిపి కార్యాలయం వద్ద గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ దత్తి లక్ష్మణరావు, టిడిపి సీనియర్‌ నాయకులు ద్వారపురెడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో బుధవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు బండి రాజు, బిడ్డిక పద్మావతి, తాడంగి రామారావు, చందక రామకృష్ణ, కొండలరావు, మంజువాణి తదితరులు పాల్గొన్నారు. కొమరాడ మండల కేంద్రంలో టిడిపి ఆధ్వర్యాన రెండో రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఎస్‌టి సెల్‌ అరకు పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బిడ్డక తమ్మయ్య ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. దీక్షలకు జనసేన నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ఎం.వెంకటనాయుడు తదితరులు పాల్గొన్నారు. గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో చేపట్టిన రిలే దీక్షలో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. చంద్రబాబును విడుదల చేసే వరకూ పోరాటం కొనసాగిస్తామని ఆమె స్పష్టంచేశారు. పాలకొండ రూరల్‌ కోటదుర్గమ్మ ఆలయ సమీపంలో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యాన నిరసన చేపట్టారు. సీతంపేట మండలంలో టిడిపి నియోజకవర్గ నాయకులు పడాల భూదేవి తన క్యాంపు కార్యాలయంలో మండల నాయకులతో సమావేశమ య్యారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడును అన్యాయంగా కేసుల్లో ఇరికించి రిమాండ్‌కు పంపించిన తీరును ప్రజల్లోకి తీసుకెళ్ళాలని నాయకులకు భూదేవి సూచించారు. సమావేశంలో మాజీ ఎంపిపిలు ఆరిక లచ్చుమయ్య, సవర కుంపి, సీనియర్‌ నాయకులు సవర సూర్యారావు, సవర గంగయ్య, సవర మల్లేశ్వరరావు, సవర రాము, సవర మంగయ్య, సవర మాసయ్య, తదితరులు పాల్గొన్నారు.

దీక్షలు భగం
పార్వతీపురం రూరల్‌ : టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఆ పార్టీ నాయకులు స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్స్‌ కూడలిలో బుధవారం చేపట్టిన రిలే నిరాహార దీక్షను పోలీసులు భగం చేశారు. టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ ద్వారపురెడ్డి శ్రీదేవి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. పట్టణ సిఐ కృష్ణారావు పోలీసు సిబ్బందితో శిబిరం వద్దకు చేరుకొని, అనుమతులు లేవని అడ్డుకొన్నారు. పోలీసుల చర్యలపై నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ తరుణంలో 12 మంది నాయకులను బలవంతంగా వాహనాల్లో ఎక్కించి గరుగుబిల్లి స్టేషన్‌కు తరలించారు. సొంత పూచీకత్తుపై సాయంత్రం వారిని విడుదల చేశారు. కార్యక్రమంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు గొట్టాపు వెంకట్‌ నాయుడు, పట్టణ అధ్యక్షులు జి.రవికుమార్‌, బోను చంద్రమౌళి, బార్నాల సీతారాం, బడే గౌరినాయుడు, తాతపూడి వెంకటరావు, కె.నారాయణరావు, కోల మధుసూదన్‌రావు, సరిత పాల్గొన్నారు.