రాష్ట్రంలో అరాచక పాలన
- చంద్రబాబును సిఎంగా చేసుకుందాం : టిడిపి
- ఘనంగా జిల్లా నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవం
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తుందని, తక్షణమే ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన సమయం వచ్చిందని, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేసుకుందామని పలువురు టిడిపి నేతలు పేర్కొన్నారు. ఆదివారం నంద్యాల శివారు ప్రాంతంలోని రైతు నగరం వద్ద ఉన్న యాతం జయచంద్ర రెడ్డి ఫంక్షన్ హాల్‌లో టిడిపి జిల్లా నూతన అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి జిల్లా ఇన్‌ఛార్జి, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, మాజీ మంత్రులు ఎమ్మెల్సీ ఎన్‌ఎండి ఫరూక్, ఏరాసు ప్రతాప్ రెడ్డి, భూమా అఖిల ప్రియ, మాజీ ఎమ్మెల్యేలు బిసి జనార్దన్ రెడ్డి, గౌరు చరిత, అబ్జర్వర్ మురళి, కర్నూలు జిల్లా అధ్యక్షులు బిటి నాయుడు, యువ నాయకులు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా నూతన అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గౌడ్‌తో అమర్నాథ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం అమర్నాథ్ రెడ్డి మాట్లాడారు. నాటి నుండి నేటి వరకు బిసిలకు టిడిపి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. వైసిపి ప్రభుత్వంలో ప్రజలకు రక్షణ కరువైయిందన్నారు. నంద్యాల జిల్లాలో టిడిపి బలంగా ఉందని, ప్రతి కార్యకర్త, నాయకుడు 6 నెలల కాలంలో కష్టపడి పనిచేసి చంద్రబాబు నాయుడును గెలిపించుకోవాలని తెలిపారు. వైసిపి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేదని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు రావడం లేదన్నారు. రూ.60 వేల కోట్ల పెట్టుబడులు బయటకు వెళ్లిపోయాయన్నారు. పరిశ్రమలు రాకపోవడంతో యూవత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‌ఎండి ఫరూక్ మాట్లాడుతూ సమయస్ఫూర్తితో, సమన్వయంతో పని చేయాలని, స్థానికంగా వచ్చే సమస్యలను అధిగమించి ముందుకు సాగాలని నూతన అధ్యక్షుడికి సూచించారు. ఏరాసు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. భూమా అఖిల ప్రియ మాట్లాడుతూ పార్టీలో అంతర్గత సమస్యలు లేకుండా చుడాలన్నారు. బిసి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గంల రెండు బాధ్యతలు ఉన్నందుకు అక్కడ గౌరు వెంకట రెడ్డి సేవలు అవసరమనే అదినాయకత్వం తప్పించారని, ఎలాంటి అపోహలు వద్దన్నారు. నంద్యాల జిల్లాలోకి బస్సు యాత్ర రేపటి నుండి రాబోతుందని, అందరం ఐక్యంగా పాల్గొని విజయంతం చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టిడిపి జెండా ఎగుర వేస్తామని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా అధ్యక్షులు బిటి నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని 176 సీట్లలో వైసిపి ఓడిపోతుందని పీకే చెప్పారని, అందుకే జగన్ భయపడుతున్నారని అన్నారు. గౌరు చరిత మాట్లాడుతూ బిసిలకు, మైనార్టీలకు, దళితులకు టిడిపి పెద్ద పీట వేస్తుందన్నారు. ధర్మవరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ డోన్ నియోజకవర్గంపై కొత్త అధ్యక్షులు దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహమ్మద్ మాట్లాడుతూ బక్రీద్ సందర్బంగా ఓ మైనార్టీ వ్యక్తిపై కేసు పెట్టారని, అన్ని వర్గాల ప్రజలపైనా దాడులు పెరిగాయన్నారు. మురళి మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టిడిపితోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










