May 24,2023 22:42

కరపత్రాలు విడుదల చేస్తున్న నాయకులు, కార్మికులు

ప్రజాశక్తి - పెనుకొండ : నగర పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 31 తేదీ నుండి జూన్‌ 9 వరకు హిందూపురం నుంచి నిర్వహించే రాష్ట్ర జాతను జయప్రదం చేయాలని మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. బుధవారం నగర పంచాయతీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రజాతకు సంబందించిన కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ, సిఐటియు సి.రమేష్‌ మాట్లాడుతూ పట్టణ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తున్న కార్మికులపై పాలకులు చిన్నచూపు చూస్తున్నారన్నారు. 2019 ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలోనూ పాదయాత్రలో జగన్మోహన్‌ రెడ్డి మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికులు, కాంట్రాక్ట్‌ అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందికి వాగ్దానాల వర్షం కురిపించారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత వారికి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. పర్యావరణాన్ని ప్రజా ఆరోగ్యాన్ని పరీక్షిస్తున్న మున్సిపల్‌ కార్మికులను ఉద్యోగులను ఆప్కాస్‌ అనే బానిస వ్యవస్థలో నెట్టివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కార్మికులు ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలుకై పోరాటానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆటో కార్మికుల యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పెడబల్లి బాబా, సిఐటియు మండల కార్యదర్శి బాబావలి, నగర పంచాయతీ కార్మికుల యూనియన్‌ నాయకులు చిన్న వెంకటేష్‌ , ముత్యాలు, నరసింహులు, లక్ష్మీదేవి, శాంతమ్మ, గంగరత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.