ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్ : విభజన చట్టంలోని హామీలు అమలు చేయకుండా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ద్రోహం చేసిందని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు.. బిజెపితో కలిసి ఆడుతున్న కపటనాటకాలకు తెరదించే సమయం వచ్చిందన్నారు. వాటి విముక్తికి సిపిఎం ప్రజా ప్రణాళిక దిక్సూచికని తెలిపారు. బుధవారం స్థానిక సుందరయ్య భవనంలో అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎంను బలపరచాలనే ప్రజా ప్రణాళిక బ్రోచరును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడగొట్టి పదేళ్లు పూర్తికావస్తోందన్నారు. ఆ సమయంలో అరచేతిలో మోడీ స్వర్గాన్ని చూపించి, తీవ్ర మోసం చేశారని విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా, పోలవరం జాతీయ ప్రాజెక్టు, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రామాయపట్నం మేజర్ పోర్టు, రాజధాని నిర్మాణం, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటు, రైల్వే జోన్ వంటి విభజన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకుండా తీరని మోడీ ద్రోహం చేశారని మండిపడ్డారు. రాష్ట్రం అధోగతి పాలవుతున్నా, రాష్ట్రానికి ద్రోహం చేసి, విభజన హామీలకు ఎసరు పెట్టిన కేంద్రాన్ని పల్లెత్తు మాటనే ధైర్యం సిఎం జగన్‌కు లేకపోయిందని వాపోయారు. రాజధాని నిర్మాణం పూర్తి చేయడం చేతకాక, వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల పేరుతో జపం చేస్తున్నారని విమర్శించారు. ఎంతసేపూ నవరత్నాల గురించే తప్ప పెరిగే ధరలు, నిరుద్యోగం, గిట్టుబాటు లేని వ్యవసాయం, రక్షణ కరువైన చేతివృత్తుల వారి సమస్యలు ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టిడిపి రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయం గురించి పల్లెత్తుమాట అనకపోగా పార్లమెంట్లో బిజెపిని బలపరుస్తూ, రాష్ట్రంలో అధికారం కోసం పాకులాడుతుండడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపితో పోరాడితేనే భవిష్యత్తుకు గ్యారెంటని గమనించాలన్నారు. మోడీ నాయకత్వాన్ని సమర్థిస్తూ మన రాష్ట్రానికి ఏ విధంగా న్యాయం చేయగలరో జనసేన పార్టీ అధినేత ఆలోచించుకోవాలని హితవుపలికారు.
ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం ప్రజా ప్రణాళికను పొందుపరిచిందని తెలిపారు. రూపాయికే యూనిట్ కరెంటు, పేదలకు 300 యూనిట్లు ఉచితం, స్మార్ట్ మీటర్లు, చార్జీలు రద్దు, రూ.400కే గ్యాస్, రూ.60కే లీటర్ పెట్రోల్, డీజిల్, ఉచితంగా ఇసుక, ఒక్కొక్కరికి 10 కిలోల ఉచిత బియ్యం, పప్పు, నూనెలు సరఫరా, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని ప్రకటించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, విశాఖ ఉక్కు పరిరక్షణ, అమరావతిలోని రాజధాని నిర్మాణం, 40 వేల పోస్టులతో మెగా డిఎస్‌సి, 2.50 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయడంతోపాటు నిరుద్యోగ భృతి రూ.5 వేలు అందిస్తామని వెల్లడించారు. వీటితోపాటు మరికొన్ని అంశాలను ప్రజాప్రణాళికలో పొందుపరిచినట్లు తెలిపారు. అందులో భాగంగా చేపడుతున్న ప్రజా రక్షణ భేరి బస్సు యాత్ర ఈ నెల 30న సీతంపేటలో ప్రారంభమై, కురుపాం మీదుగా సాయంత్రం 5 గంటలకు పార్వతీపురం చేరుకుంటుందని తెలిపారు. అదేరోజు పార్వతీపురం పాత బస్టాండ్ వద్ద, 31న సాలూరులో నిర్వహించే బహిరంగ సభలకు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.పుణ్యవతి హాజరవుతున్నట్లు తెలిపారు. సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి.ఇందిర, జిల్లా నాయకులు గొర్లి వెంకటరమణ, పట్టణ నాయకులు బి.సూరిబాబు, వి.చిన్నంనాయుడు పాల్గొన్నారు.










