Jul 08,2023 19:47

cartoon

రాష్ట్ర కార్పొరేషన్ల డైరెక్టర్లు ఎక్కడ..?
- ఆత్మకూరు నుంచి ముగ్గురున్నా అభివృద్ధి శూన్యం
- కార్పొరేషన్‌ కార్యక్రమాలకూ హాజరు కాని వైనం..
ప్రజాశక్తి - ఆత్మకూర్‌

     రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీ కార్యకర్తలకు పదవులు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వాటిలో డైరెక్టర్లుగా, చైర్మన్లుగా నియమించింది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆత్మకూరు మండలం నుండి ముగ్గురికి వివిధ కార్పొరేషన్లకు డైరెక్టర్లుగా అవకాశం సాధించారు. ఇందులో షేక్‌ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌గా ఆత్మకూరుకి చెందిన అంజాద్‌, రాష్ట్ర సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా గ్రంధివేముల పార్వతిని, రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా రామలక్ష్మయ్యకు పదవులు దక్కాయి. అయితే ఈ ముగ్గురు కూడా నేడు ఆత్మకూరులో కార్పొరేషన్‌ కార్యక్రమాలకు, పార్టీకి అందుబాటులో కూడా లేరు. ఒక్కొక్క కార్పొరేషన్‌ డైరెక్టర్‌కి నెలకు 13 వేల నుండి 16 వేల రూపాయల వరకు వేతనాలను ప్రభుత్వం చెల్లిస్తుంది. షేక్‌ కార్పొరేషన్‌ ఉన్నప్పటికీ ఆ సామాజిక వర్గాల అభివృద్ధి కోసం ఎలాంటి సంక్షేమ పథకాలను ఈ ప్రాంత ప్రజలకు అమలయ్యే విధంగా ఆ డైరెక్టర్‌ పని చేయలేకపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు వైసిపి పట్టణ అధ్యక్షుడిగా ఉన్న అంజాద్‌ను పట్టణంలోని నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు అతనిని పదవి నుంచి తప్పించాలని ఎమ్మెల్యేపై ఒత్తిడి తేవడంతో తప్పని పరిస్థితుల్లో తొలగించారు. దీంతో అంజాద్‌ అలీ పార్టీపై వ్యతిరేకత పెంచుకొని ఇతర పార్టీలోకి వెళ్లేందుకు తన అనుచరులతో చర్చించుకొని అవకాశం వస్తే ఏ పార్టీలోకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ జి పార్వతి తన తండ్రి గ్రంధివేముల బాలన్న వైసిపి ఎస్సీ సెల్‌ నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా కొనసాగేవారు. కొన్ని కారణాల వల్ల స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి బాలన్నను కూడా జిల్లా అధ్యక్ష పదవి నుండి తొలగించడంతో ఆయన కూడా పార్టీకి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కర్నూల్లో నివాసం ఉంటున్నారు. ఆయన కుమార్తె జి.పార్వతి కూడా కర్నూలుకు వెళ్లారు. ఆమె కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గౌరవేతను తీసుకోడమే తప్ప అడపా దడపా కార్పొరేషన్‌ ఏర్పాటు చేసే సమావేశాలకు వెళ్లడానికే పరిమితమవుతున్నారు. ఆత్మకూరు పట్టణానికి చెందిన మరో కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రామ లక్ష్మయ్య రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పటికీ ఆయన పదవి పొందినప్పుడు నుండి ఏ రోజు ఆత్మకూరులో కనిపించలేదు. పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన హాజరు కావడం లేదు. ఇతను కూడా కర్నూలులో నివాసం ఉంటూ అప్పుడప్పుడు ఆత్మకూరుకి రావడం పోవడమే తప్ప పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. ఆత్మకూర్‌ పట్టణం క్రీడలకు పుట్టినిల్లుగా ఉమ్మడి జిల్లాలోనే పేరు ఉంది. అయితే ఈ ప్రాంతంలో క్రీడాభివృద్ధి కోసం ఆయన స్పోర్ట్స్‌ అథారిటీ కార్పొరేషన్‌లో ఏనాడూ చర్చ పెట్టి కృషి చేసిన దాఖలాలు లేవు. ఆత్మకూరు పట్టణం నుండి ముగ్గురు డైరెక్టర్లు ఉన్నప్పటికీ ఈ ప్రాంతం అభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదని పెద్ద ఎత్తున ప్రజలు చర్చించుకుంటున్నారు.