ప్రజాశక్తి గుడిబండ : మండల పరిధిలోని రాళ్లపల్లివాసులు నాలుగు నెలలుగా తాగునీటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తమ సమస్యను సంబంధిత అధికారులు కానీ సర్పంచి గాని పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా గ్రామంలోని మహిళలు సోమవారం స్థానిక సచివాలయం ముందు ఆందోళనకు దిగారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామస్తులు తాగునీటి ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశ్యంతో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఓ బోరును తవ్వించగా అందులో పుష్కలంగా నీరు లభ్యమయ్యాయని అఆన్నరు. అయితే అధికారులు, పాలకులు నిర్లక్ష్యం కారణంగా తాము నాలుగు నెలలుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పైప్ లైన్లు వేసి తద్వారా గ్రామానికి వీటిని సరఫరా చేయాల్సి ఉండగా అధికారులు, పాలకులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. పైపులకు కొళాయిలు బిగించక పోవటంతో నీరు వృథాగా పోతున్నా సంబంధిత సర్పంచి గాని అధికారులను గాని పట్టించుకోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను పలుసార్లు వారికి వినించుకున్న నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారన్నారు. దీంతో విసుగుచెంది సచివాలయం ముందు ఆందోళన దిగామన్నారు. వారం రోజుల్లోపు అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించాలని లేకపోతే గుడిబండ ఎంపీడీవో కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. అనంతరం తమ డిమాండ్లతోకూడిన వినతి పత్రాన్ని స్థానిక పంచాయతీ కార్యదర్శి గోవిందప్పకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మహిళలు జయమ్మ, పద్మావతి, సుశీలమ్మ, కమలమ్మ, సరస్వతి, సునీత, భాగ్యమ్మ, కిష్టప్ప, రాజన్న, నాగరాజు పాల్గొన్నారు.










