పార్వతీపురం: రాబీస్ వ్యాధి పట్ల అవగాహన అవసరమని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బగాది జగన్నాథ రావు అన్నారు. ప్రపంచ రాబీస్ వ్యాధి దినోత్సవం సందర్భంగా స్థానిక జిల్లా ఆసుపత్రిలో గురువారం అవగాహన కార్యక్రమం జరిగింది. కార్మికులకు, కుక్కలను పట్టే వారికి, కుక్క కాటుతో వచ్చిన రోగులకు విఆర్‌వి ఇంజెక్షన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ ప్రజలకు కుక్కకాటు వల్ల వచ్చే రాబీస్ వ్యాధి గురించి అవగాహన ఉండాలని, కుక్క కాటు వేసిన వెంటనే దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అవసరమైన వైద్యం చేయించుకోవాలని ఆయన సూచించారు. జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ వాగ్దేవి మాట్లాడుతూ కుక్క కాటుకు ఎటువంటి నాటు వైద్యం తీసుకోరాదన్నారు. వైద్యం తీసుకోవడంలో అలసత్వం ఉండకూడకూడదని, రాబీస్ వ్యాధి ప్రాణాంతకమని సూచించారు. కార్యక్రమం లో జిల్లా సర్విలియేన్స్ అధికారి డాక్టర్ నవీన్ కుమార్, ఎపి ఎన్‌జిఒ జిల్లా అధ్యక్షులు జివిఆర్‌ఎస్ కిషోర్, యానిమల్ బైట్ క్లినిక్ సభ్యులు పాల్గొన్నారు.










