Apr 29,2023 15:19
  • అవినీతికి పాల్పడిన చైర్పర్సన్ పై...
  • భూ కబ్జాకి పాల్పడిన మున్సిపల్ ముఖ్య ప్రజా ప్రతినిధి పై....
  • విచారణ చేయాలని అధికార పక్షం డిమాండ్
  • ప్రజా సమస్యలపై చర్చించాలని పట్టుబట్టిన ప్రతిపక్షం
  • స్థానిక పాలనతోనే అభివృద్ధి సాధ్యమన్న వైస్ చైర్మన్ బలరామిరెడ్డి....

 ప్రజాశక్తి-శ్రీ సత్య సాయి జిల్లా (హిందూపురం) : పురపాలక సంఘ కౌన్సిల్ సాధారణ సమావేశం శనివారం మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ అధ్యక్షతన జరిగింది. సమావేశం ప్రారంభానికి ముందే అధికార పార్టీలో అసమ్మతి కౌన్సిలర్లు మున్సిపల్ రెండవ వైస్ చైర్మన్ బలరామిరెడ్డి చాంబర్ లో సమావేశమైనారు. సమావేశం ప్రారంభ సమయంలో అసమ్మతి కౌన్సిలర్లు మున్సిపల్ చైర్ పర్సన్ అవినీతిపై, విద్యుత్ దీపాల కొనుగోలులో జరిగిన అవినీతి, మున్సిపల్ ముఖ్య ప్రజా ప్రతినిధి భూకబ్జా, రైల్వే రోడ్డు విస్తరణ పనులు, మార్కెట్ తదితర అంశాలపై ప్లకార్డులను ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ సమావేశానికి వచ్చారు. దీనిని గమనించిన మున్సిపల్ చైర్ పర్సన్ కౌన్సిల్ సమావేశంలో రచ్చ జరుగుతుందని తెలిసి అజెండాలోని అంశాలన్నింటినీ ఆమోదం తెలుపుతున్నట్లు మిగిలిన అధికార పార్టీ కౌన్సిలర్లతో ఆమోదం తీసుకొని, సమావేశం పూర్తి అయిందని చెప్పి వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహించిన అధికార పార్టీ అసమతి కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్ వాకిలి వేసి అవినీతిపై చర్చ జరగకుండా బయటకు వెళ్లకూడదని పట్టుబట్టారు. ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రజా సమస్యలపై చర్చించాలని, అజెండాలోని అంశాలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ చైర్ పర్సన్ పోడియం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. అధికార పార్టీ అసమ్మతి కౌన్సిలర్లు అయినా శివ, ఆసిఫ్ తదితరులు కౌన్సిల్ ఏర్పడి రెండు సంవత్సరాలు నుంచి పురపాలక సంఘ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతుందన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని మున్సిపల్ ప్రజాప్రతినిధి భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. పురపాలక సంఘంలో అభివృద్ధి పనులను చేపడుతున్న  గుత్తేదారుల నుంచి మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ పెద్ద ఎత్తున కమిషన్ లు తీసుకుంటుందని ఆరోపించారు. అందుకోసమే గుత్తేదారులు అభివృద్ధి పనులు చేయడానికి ఏ ఒక్కరు ముందుకు రావడం లేదన్నారు. నాడు విపక్షంలో ఉన్నప్పుడు వివక్షను చూపి వాడుల అభివృద్ధికి నిధులు కేటాయించలేదని, నేడు అసమ్మతిలో ఉన్నామన్న కారణంతో నిధులు కేటాయించకుండా వివక్ష చూపుతున్నారన్నారు. వీధి దీపాల కోసం కొనుగోలు చేసిన ఎల్ఈడి దీపాల్లో లక్షలాది రూపాయలు అవినీతి జరిగిందని దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్లు కనీస చర్చ లేకుండానే అజెండాలోని అంశాలను ఎలా ఆమోదిస్తారని. ప్రజా సమస్యలపై చర్చించకుండానే సమావేశాన్ని ఎలా ముగిస్తారన్నారు. ప్రజా సమస్యలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ చైర్ పర్సన్ పోడియం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. శనివారం మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో జరిగిన సంఘటనలపై వైస్ చైర్మన్ బలరామిరెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు స్థానికులు అయితేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రాతినిత్య వహించిన పులివెందుల నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఊహించని విధంగా అభివృద్ధి చేశారన్నారు. హిందూపురం నియోజకవర్గంలో టిడిపి ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంత ప్రజలు పట్టం కడుతున్నారు. ఇక్కడ ప్రాతినిధ్యం నుంచి గెలుపొందిన ఎన్ టి రామారావు ముఖ్యమంత్రిగా పని చేశారు, ప్రస్తుత శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి తనయుడు, గత టిడిపి ప్రభుత్వం ఉన్న సమయంలో ముఖ్యమంత్రికి స్వయాన బావమరిది, వియ్యంకుడు అయినప్పటికీ ప్రత్యేక నిధులను తీసుకొని వచ్చి ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. చివరి నిమిషంలో అభివృద్ధి కోసం నిధులు తీసుకొని వచ్చారు, ఆ నిధులు వెనక్కి వెళ్లినప్పటికీ ఆ నిధులు తిరిగి ఇవ్వాలని ఏ రోజు కూడా శాసనసభలో కాని సంబంధిత మంత్రులతో గానీ చర్చలు జరపలేదన్నారు. ఒక శాసన సభ్యుడిగా హిందూపురం పురపాలక సంఘంతో పాటు నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించారన్నారు. కౌన్సిల్ లో జరిగిన సంఘటనలపై వైస్ చైర్మన్ బలరామిరెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.