న్యూఢిల్లీ : కొవిడ్ సమయంలో జర్నలిస్టుల తొలగింపుపై అధ్యయనం నిర్వహించేందుకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పిసిఐ) సబ్ కమిటీని నియమించింది. 2020 మార్చి నుండి 2021 ఫిబ్రవరి మధ్య వేటుకు గురైన జర్నలిస్టులు తమ వివరాలను పంపాల్సిందిగా కోరింది. ఆన్‌లైన్ ఫామ్ లేదా ఇమెయిల్ ద్వారా సబ్‌కమిటీకి వివరాలు అందించాల్సిందిగా జర్నలిస్టులకు సూచించింది. మహమ్మారి సమయంలో వేటుకు గురైన జర్నలిస్టుల నివేదికను రూపొందించేందుకు మాత్రమే సమాచారాన్ని సేకరిస్తున్నామని, ఈ అధ్యయనంతో వారు ఎలాంటి ఉపశమనం కలిగించే అవకాశం ఉండదని గుర్తించాల్సిందిగా పిసిఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఉపశమనం కలిగించే అధికారం కాని, పరిధి కాని పిసిఐకి లేవని స్పష్టం చేసింది.
ఈ సబ్ కమిటీలో పిసిఐ సభ్యులు గుర్బీర్ సింగ్, ఎల్.సి. భారతీయ, ప్రజ్ఞానంద చౌదరి, జె.ఎస్. రాజ్‌పుత్ సహా జర్నలిస్టులు పి. సాయినాథ్, స్నేహసిస్‌లు కో ఆప్టెడ్ సభ్యులుగా ఉండనున్నారు. పిసిఐ పార్లమెంటరీ చట్టం ద్వారా ఏర్పడిన న్యాయ స్వతంత్ర సంస్థ. పత్రికా స్వేచ్ఛను రక్షించడం, వారాపత్రికలు, వార్తా సంస్థల ప్రమాణాలను మెరుగుపరచాలన్న రెండు లక్ష్యాల కోసం ఈ సంస్థ పనిచేస్తుంది.










