Oct 20,2023 15:20

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న మీటర్ రీడర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించాలని సి.ఐ.టి.యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి .అంజిబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం  కార్మిక కర్షక భవన్ నందు మిటర్ రీడర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పి. రాజు అధ్యక్షతన మీటర్ రీడర్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న మీటర్ రీడర్స్ కు ఇప్పటివరకు పీస్ రేటు విధానాన్ని కొనసాగిస్తున్నారని అది కూడా తగ్గించి ఇస్తున్నారని అన్నారు. పీస్ రేటు విధానం రద్దు చేయాలని కనీస వేతనం అమలు చేయాలని అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఈనెల 27న అనంతపురం నందు మోటార్ బైక్ ర్యాలీ ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. అనంతపురంలో ప్రారంభమైన మోటార్ బైక్ ర్యాలీ కర్నూలుకు 28వ తేదీన చేరుకుంటుందని తెలిపారు. ఎస్సీ ని కలిసి వినతిపత్రం అందజేసిన అనంతరం నంద్యాల, గిద్దలూరు, ఒంగోలు మీదుగా విజయవాడ చేరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మీటర్ రీడర్స్ అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు ఈ సమావేశంలో మీటర్ రీడర్స్ యూనియన్ నాయకులు రాముడు, హమీద్, వీరేష్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.