Sep 08,2023 12:16

న్యూఢిల్లీ : రెండు రోజుల పాటు జరగనున్న జి20 శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా ప్రధాని మోడీ 15కి పైగా  ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొననున్నారు.  అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ సహా పలు దేశాల అధ్యక్షులతో ప్రధాని చర్చలు జరపనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. శుక్రవారం అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాలతో ప్రధాని మోడీ తన అధికారిక భవనంలో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. అలాగే మారిషన్‌ అధినేతతో కూడా సమావేశం కానున్నారు. శనివారం జి20 శిఖరాగ్రసదస్సులో పాల్గొన్న  అనంతరం బ్రిటన్‌, జపాన్‌, జర్మనీ, ఇటలీ అధ్యక్షులతో చర్చించనున్నారు.
శనివారం నుండి రెండు రోజుల పాటు జరిగే జి20 శిఖరాగ్ర సదస్సు కోసం న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో అధునాతన సదుపాయాలతో నిర్మించిన భారత్‌ మండపం కన్వెన్షన్‌ సెంటర్‌ వేదిక కానుంది. దీంతో ఢిల్లీ లోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు విధించారు. రాజధాని సరిహద్దులను మూసివేయడంతో పాటు నగరంలో మూడు రోజుల పాటు పాఠశాలలు, కార్యాలయాలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు.