Jun 15,2023 21:12

దాడిలో గాయపడిన యువకుడు హరి ఠాగూర్‌

'ఫ్రీ ఫైర్‌' రగడ
- కత్తులు, కర్రలతో రెండు గ్రామాల యువకుల దాడి
- ఐదుగురికి గాయాలు
ప్రజాశక్తి - మహానంది

       ఫ్రీ ఫైర్‌ మొబైల్‌ గేమ్‌ విషయమై కొందరు యువకుల మధ్య మొదలైన వివాదం రెండు గ్రామాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఓ గ్రామం యువకులు కత్తులు, కర్రలతో మూకుమ్మడిగా మరో గ్రామం యువకులపై దాడికి దిగిన ఘటన బుధవారం రాత్రి మహానంది మండలం గాజులపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బసాపురం గ్రామానికి చెందిన యువకుడు హరి ఠాగూర్‌ అలియాస్‌ రంగ స్వామి, గాజులపల్లి గ్రామానికి చెందిన యువకుడు హర్షద్‌లు బుధవారం రాత్రి మొబైల్‌ ఫోన్‌లో ఆన్‌లైన్‌లో ఫ్రీఫైర్‌ గేమ్‌ ఆడుతూ ఇద్దరి మధ్య మాటమాట పెరిగి దూషణలకు దారి తీసింది. రాత్రి 9 గంటల సమయంలో హర్షద్‌ తన మిత్రులతో కలిసి బసాపురం హరి ఠాగూర్‌పై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. విషయం తెలిసిన ఠాగూర్‌ బంధువులు రాత్రి పది గంటల సమయంలో కొంత మంది యువకులతో కలిసి గాజులపల్లి గ్రామంలోని బ్యాంకు బజారులో హర్షద్‌, మిత్రులపై విచక్షణారహితంగా దాడులు చేశారు. దీంతో హర్షద్‌ పారిపోయాడు. మళ్లీ బసాపురంకు చెందిన కొందరు యువకులు కత్తులు పట్టుకొని హర్షద్‌ బంధువుల కుటుంబ సభ్యులను గాలిస్తూ దాడులకు పాల్పడ్డారు. హర్షద్‌ ఇంటిని, మిత్రుల ఇండ్ల వాకిళ్లను ధ్వంసం చేశారు. ఈ వివాదంలో హరి ఠాగూర్‌, హర్షద్‌తోపాటు మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న మహానంది ఎస్సై జి నాగేంద్ర ప్రసాద్‌ సంఘటన స్థలానికి చేరుకొని అల్లరి మూకలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాడి ఘటనపై వివరాలు సేకరించి కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.