ప్రజాశక్తి - సీతానగరం : ప్రైడే-డ్రైడే కార్యక్రమాలను పక్కగా జరిపి దోమల వ్యాప్తిని అరికట్టాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి.జగన్నాథరావు సూచించారు. ఈ మేరకు ఆయన సీతానగరం గూడెం వీధిలో వైద్య సిబ్బంది నిర్వహించిన డ్రైడే కార్యక్రమాన్ని శుక్రవారం పరిశీలించారు. వైద్య సిబ్బందితో ఇంటింటి సర్వే చేపట్టి ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలను గుర్తించి పారాబోయించడం చేయించారు. ఈ సందర్బంగా డాక్టర్ జగన్నాథరావు మాట్లాడుతూ మలేరియా, డెంగీ తదితర జ్వరాలకు కారణభూతమైన దోమలను నిర్మూలించాలంటే ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. తాత్కాలిక నీటి నిల్వలను ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని, ఇళ్లల్లో వాడుక నిమిత్తం ఉంచిన నీటిని కూడా ఎక్కువ కాలం ఉంచరాదని, మూతలు ఉంచాలని, వారానికి ఒకటి,రెండు మార్లు తొట్టెలు, కుండీలు, డ్రమ్ములు శుభ్రం చేసి ఎండలో ఆర బెట్టాలని ప్రజలకు, సిబ్బందికి ఆయన అవగాహన కల్పించారు. జ్వరాలను గుర్తిస్తే తగు చికిత్స అందజేసి నివారణ చర్యలు చేపట్టాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. డిఐఒ డాక్టర్ టి.జగన్మోహనరావు మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య సిబ్బంది, సంబంధిత శాఖల సమన్వయంతో ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ కె.శిరీష, సిహెచ్‌ఒ ఎస్‌వి రమణ, వైద్య సిబ్బంది,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.










