తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువగా విడుదలైన చిత్రాలు ప్రేమ కథా చిత్రాలే. పైగా ఈ జానర్‌కి కనెక్ట్ అయ్యే ప్రేక్షకులూ ఎక్కువే. దీంతో ప్రేమకథలకు మన టాలీవుడ్ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. తెలిసిన కథనే కాస్త కొత్తగా చెబితే చాలు ఆ చిత్రం హిట్టయినట్లే. సరిగ్గా ఇదే ఫార్ములాని ఉపయోగించుకుని, శ్రీనివాస్ అవసరాల దాదాపు ఏడేళ్ల గ్యాప్ తీసిన చిత్రం 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'. 'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' లాంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత నాగశౌర్య, శ్రీనివాస అవరాల కాంబినేష్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ విడుదలకు ముందే మంచి టాక్ తెచ్చుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు రిసీవ్ చేసుకున్నారు? కథేంటి? వంటి విషయాలు తెలుసుకుందాం..!
కథలోకి వెళ్తే.. ఇది 2000 నుంచి 2010 మధ్యకాలంలో జరిగే కథ. బీటెక్‌లో జాయిన్ అయిన సంజరుని సీనియర్స్ ర్యాగింగ్ చేస్తుంటే.. అతన్ని వారి నుంచి కాపాడుతుంది అనుపమ కస్తూరి (మాళవికా నాయర్). అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఇక ఇంజనీరింగ్ తర్వాత మాస్టర్స్ కోసం ఇద్దకూ కలిసి యూకేకి వెళ్తారు. అక్కడ ఇద్దరూ ప్రేమలో పడతారు. సహజీవనం కూడా చేస్తారు. మాస్టర్స్ పూర్తవ్వగానే అనుపమకు వేరే నగరంలో ఉద్యోగం వస్తుంది. తనకు చెప్పకుండా ఉద్యోగానికి అప్లై చేసిందని అనుపమపై కోపంగా ఉంటాడు సంజరు. ఈ చిన్న కారణంగా వారిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడి, ఒకరికొకరు దూరమవుతారు. అదే సమయంలో సంజరుకి పూజ (మేఘా చౌదరి) దగ్గరవుతుంది. ఆమె కారణంగా సంజరు, అనుపమ మధ్య దూరం పెరుగుతుంది. ఇద్దరూ విడిపోతారు. కొన్నాళ్ల తర్వాత అనుకోకుండా ఇద్దరూ కలుస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? పూజ ప్రేమను సంజరు అంగీకరించాడా? అనుపమ జీవితంలోకి గిరి (అవసరాల శ్రీనివాస్) ఎలా వచ్చాడు? సంజరు జీవితంలోకి వచ్చిన పూజ (మేఘా చౌదరి) నీలిమా (సింగర్ హరిణి) జర్నీ ఎలా సాగింది? చివరికి సంజరు, అనుపమ కలిశారా? లేదా? అనేదే మిగతా కథ.

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి కథ ఫన్, రొమాంటిక్ అంశాలతో సరదాగా మొదలవుతుంది. సంజరు జీవితంలో చోటు చేసుకున్న ఓ కీలక ఘటన అనుపమ, సంజరు కథకు టర్నింగ్ పాయింట్ అవుతుంది. కథను ఫీల్ గుడ్‌గా ముందుకు తీసుకెళ్తుంది. కథలో బలమైన పాయింట్ ఉన్నప్పటికీ.. పూర్తి కథగా విస్తరించడంలో లోపాలు కనిపిస్తాయి. సినిమా భాషలో కాంబినేషన్ అనే మాటకి విలువెక్కువ. ఓ హీరో, డైరెక్టర్ కలిసి చేసిన సినిమా హిట్ అయితే.. అదే కాంబోలో వస్తున్న మరో చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడటం సహజం. కానీ ఆ అంచనాలను దర్శకుడు అవసరాల శ్రీనివాస్ నిలబెట్టుకోలేక పోయాడు. 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' చిత్రాన్ని మునుపటి కథల స్థాయిలో ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో విఫలమయ్యాడు. కారణాలేమైనా స్క్రిప్టులో చాలా లోపాలు కనిపిస్తాయి. మేకింగ్ పరంగా సినిమాను రిచ్‌గా తీశాడు. కానీ.. కంటెంట్‌నే బలంగా చెప్పలేకపోయాడు అనిపిస్తుంది. కాలేజీలో హీరోహీరోయిన్ల స్నేహం.. ప్రేమ.. సహజీవనం తదితర సన్నివేశాలతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇక సెకండాఫ్ ఇద్దరి మధ్య మనస్పర్థలు.. విడిపోవడం.. ఇలా భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. అయితే కలిసి జీవించాలనుకున్న ఈ జంట.. విడిపోవడానికి గల కారణాలను బలంగా చూపించ లేకపోయారు. పార్ట్ పార్ట్‌లుగా చూస్తే కొన్ని సీన్స్ ఆకట్టుకుంటాయి. కానీ ఓవరాల్‌గా మాత్రం అంతగా మెప్పించదు.
నటీనటులు విషయానికొస్తే నాగశౌర్య గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే అన్ని రకాలుగా ప్రూవ్ చేసుకొన్న యాక్టర్. సంజరు పాత్రలో మరోసారి ఒదిగిపోవడమే కాదు.. ప్రతీ సన్నివేశంలో వైవిధ్యాన్ని చూపించేందుకు ప్రయత్నించాడు. మాళవిక నాయర్ మరోసారి అనుపమగా ఎమోషనల్ పాత్రలో నటించి, మెప్పించింది. కీలక సన్నివేశాల్లో ఆమె నటన ఆకట్టుకొంటుంది. సంజరు ఫ్రెండ్‌గా నటించిన వాలైంటెన్ సినిమాను వినోదభరితంగా మార్చారు. మిగతా పాత్రల్లో నటించిన వారు వారి పాత్రలకు న్యాయం చేశారు.
ఇక ఈ సినిమాకు మ్యూజిక్ వెన్నెముక. కల్యాణి మాలిక్ అందించిన మ్యూజిక్ సన్నివేశాలను ఫీల్ గుడ్‌గా మార్చింది. పాటలు ఆడియోపరంగా ఆకట్టుకోవడమే కాకుండా.. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వెంటాడేలా ఉన్నాయి. ఇక సినిమాటోఫ్రీి మరో స్పెషల్ ఎట్రాక్షన్. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త మెరుగ్గా పనిచేయాల్సింది. ఫైనల్‌గా ప్రేమ కథలను, ఎమోషనల్ కంటెంట్‌ను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. అవసరాల మేకింగ్ లైక్ చేసేవారు ఈ సినిమాను ఎంజారు చేస్తారు.

టైటిల్: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'
నటీనటులు : నాగ శౌర్య, మాళవిక నాయర్, శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య, వారణాసి సౌమ్య చలంచర్ల, హరిణి రావు, అర్జున్ ప్రసాద్ తదితరులు
నిర్మాణ సంస్థలు : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్
నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి
స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్ అవసరాల
సంగీతం: కళ్యాణి మాలిక్, వివేక్ సాగర్(కాఫీఫై సాంగ్)
సినిమాటోగ్రఫీ: సునీల్ కుమార్ నామ
ఎడిటర్ : కిరణ్ గంటి










