Mar 13,2023 22:52

ప్రజాశక్తి - మచిలీపట్నం అర్బన్‌ : సామాన్య ప్రజలు సమస్యల పరిష్కారం కొరకు పోలీసుశాఖను ఆశ్రయిస్తారని, వాటిని స్వికరించి తక్షణమే చట్ట పరిధిలో పరిష్కరించేలా ప్రతి ఒక్క పోలీస్‌ అధికారి కషి చేయాలని జిల్లా ఎస్పీ పి జాషువా సూచించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందనలో ప్రజల ఫిర్యాదులు స్వయంగా ఎస్పీ స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. చట్ట ప్రకారం విచారణ జరిపించి, జాప్యం లేకుండా సమస్యలను తక్షణమే పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు.
స్పందనలోని ఫిర్యాదులు: ఇద్దరు కుమారులకు ఆస్తిని సమభాగాలుగా పంచినా మిగిలిన తమ పేరుమీద ఉన్న ఆస్తిని కూడా రాయాలని ఇబ్బంది పెడుతున్నారని న్యాయం చేయాలని బంటుమిల్లికు చెందిన వద్దులు ఫిర్యాదు చేశారు. ఉయ్యూరులో నివాసముండే వద్ధుడు పాండురంగారావు తన పేర ఉన్న ఆస్తి మొత్తాన్ని కుమారుడు, కుమార్తె అక్రమంగా తప్పుడు పత్రాలపై సంతకాలు చేయించుకొని ఆక్రమించు కున్నారని, అడిగితే చంపాలని చూస్తున్నారని, పరిష్కారం చూపించాలని ఫిర్యాదు చేశాడు. పెనమలూరు నుండి సమీరా అనే వివాహిత తనకు వివాహమై 2 ఏళ్ళు గడుస్తున్నా అదనపు కట్నం కోసం అత్తింటి వారు, భర్త వేధింపులకు గురి చేస్తున్నారని, న్యాయం చేయమని ఫిర్యాదు చేశారు.