Apr 18,2023 22:11

పవర్‌ లూమ్స్‌లో తనిఖీ చేస్తున్న ఎన్‌ఫోర్స్‌్‌మెంట్‌ అధికారులు

ప్రజాశక్తి - ధర్మవరం టౌన్‌ : చేనేత రకాలను పవర్‌ లూమ్స్‌ లో తయారు చేస్తే కేసులు నమోదు చేస్తామని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ రాజారావు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అప్పాజీ హెచ్చరించారు. ఈ మేరకు వారు పట్టణంలో మంగళవారం దాడులు నిర్వహించి పవర్‌ లూమ్స్‌ మగ్గంలో చేనేత ఉత్పత్తులను తయారు చేస్తున్న వాటిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పట్టణంలో చింతా ఆనంద్‌ పవర్‌లూమ్స్‌లో చేనేత రకాలను తయారు చేస్తున్నారని అందుకే అతనిపై కేసు నమోదు చేశామని అన్నారు. పవర్‌ లూమ్స్‌లో 45 శాతం రేషం ఉపయోగించవచ్చన్నారు. 45శాతం రేషం దాటితే చేనేత రకాలను ఉల్లంఘించినట్లేనని తెలిపారు. ఇక నుంచి తరచూ దాడులు నిర్వహిస్తామని చెప్పారు. గత పది నెలల్లో 5 కేసులు నమోదు చేశామన్నారు. పవర్‌లూమ్స్‌ లో 11 రకాల చేనేత ఉత్పత్తులను తయారు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చేనేత రకాలను కాపాడేందుకు, పట్టు పరిశ్రమను రక్షించేందుకు ప్రతిరోజు దాడులు నిర్వహించి పవర్‌ లూమ్స్‌లో చేనేత రకాలు తయారు చేయకుండా దాడులు చేసి కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఈ దాడుల్లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మహేశ్వరరెడ్డి, జూనియర్‌ అసిస్టెంట్‌ నాగసాయి, సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు.