Oct 22,2023 07:57

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : జనసేన అధికార ప్రతినిధులందరూ రాజ్యాంగ విలువలకు కట్టుబడి పార్టీ వైఖరిని బలంగా వినిపించాలని ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ సూచించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జనసేన అధికార ప్రతినిధులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. టివి చర్చల్లో పాల్గొనేవారు రాజకీయాలు, సమకాలీన అంశాలు, ప్రజా సమస్యలపై లోతుగా అధ్యయనం చేసి వెళ్లాలని పేర్కొన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యక్తిగత దూషణలకు దిగరాదని హితవు పలికారు. అదే సమయంలో ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో మరింత సంయమనంతో వ్యవహరించాలని పేర్కొన్నారు. పార్టీ ప్రచార వ్యవస్థను పటిష్టం చేసేందుకు వచ్చే నవంబరులో వర్క్‌షాప్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వర్క్‌షాప్‌ నిర్వహణకు టి శివశంకర్‌ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కమిటీని ప్రకటించారు. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు తమ్మిరెడ్డి శివశంకర్‌, బొలిశెట్టి సత్యనారాయణ, గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్‌ పాల్గొన్నారు.