Apr 03,2023 21:52

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : పట్టణంలోని సత్తెమ్మ గుడి నుంచి ఎనుములపల్లి గణేష్‌ సర్కిల్‌ వరకు టెంపుల్‌ జోన్‌ గా ప్రకటించాలని అఖిలపక్షాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు సోమవారం జిల్లా కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఈనెల 1న సత్తెమ్మ గుడి వద్ద టీడీపీ వైసీపీ నాయకుల మధ్య జరిగిన రాజకీయ ఘర్షణలు వల్ల పుట్టపర్తి పవిత్రతను మంటగలిపారని అన్నారు. కేవలం రాజకీయ స్వార్థం కోసం ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి పరువు గంగలో కలిపారని విమర్శించారు. ఏ పార్టీ వారైనా తమ రాజకీయ కార్యకలాపాలను ఎనుములపల్లి సర్కిల్‌ గణేష్‌ సర్కిల్‌ వద్ద జరుపుకోవచ్చని, ఇందుకు సంబంధించి కలెక్టర్‌ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పుట్టపర్తిలో ఇలాంటి ఘర్షణ, యుద్ధ వాతావరణం ఇప్పటివరకు జరగలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐసిసి సభ్యులు కోటాసత్యం, టిడిపి జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, చెన్నకేశవ నాయుడు, శామీర్‌, బిజెపి నాయకులు కొండమరాజు, కత్తి రాజారెడ్డి, తెలుగు యువత శామీర్‌ తదితరులు పాల్గొన్నారు.