హిందూపురం : హిందూపురంలో రాజకీయ కాక వేడిపుట్టిస్తోంది. ఈ సారి వివాదం వీరసింహారెడ్డి చిత్రం చుట్టూ తిరుగుతోంది. సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా శతదినోత్సవ వేడుకలను శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో నిర్వహించడానికి టిడిపి నాయకులు, బాలయ్య అభిమానులు సిద్ధమయ్యారు. వేడుకలను నిర్వహించేందుకు పురపాలక సంఘ ఆధీనంలో ఉన్న ఎంజిఎం మైదానం ఇవ్వాలని బాలయ్య అభిమానులు ఈ నెల 17వ తేదీన పురపాలక సంఘం అధికారులను రాతపూర్వకంగా కోరారు. గత నాలుగు రోజులుగా అనుమతుల కోసం పురపాలక సంఘం కార్యాలయం చుట్టూ తిరిగారు. మున్సిపల్ అధికారులు అనుమతులను నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన అభిమానులు, టిడిపి నాయకులు నిరసనకు సిద్ధం అయ్యారు. బుధవారం నాడు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అయినప్పటికీ అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో మరింత ఆగ్రహంతో మున్సిపల్ కార్యాలయం ముందు ఉన్న ప్రధాన రహదారిపై మండుటెండల్లో మూడు గంటలు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వం, ఎమ్మెల్సీ, ఛైర్‌పర్సన్, కమిషనర్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓ వైపు నిరసనలు జరుగుతుండగానే టిడిపి ముఖ్య నాయకులు, పట్టణ సిఐలు ఈరన్న, వెంకటేశ్వర్లు సమక్షంలో మున్సిపల్ అధికారులతో రెండుసార్లు చర్చలు జరిపారు. అయినప్పటికీ ఇన్‌ఛార్జి కమిషనర్ ఆనంద్ కుమార్ అనుమతులు ఇవ్వడానికి సాధ్యం కాదని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ సెలవులో ఉన్నారని, ఇన్‌ఛార్జి కమిషనర్‌గా తాను అనుమతి ఇవ్వడానికి వీలు లేదంటూ వారికి తెలిపారు. దీంతో బాలయ్య అభిమానులు, టిడిపి నాయకులు అనుమతులు మంజూరు చేయాలంటూ రోడ్డుపై బైటాయించారు. మూడు గంటల పాటు రాస్తారోకో జరగడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వేడుకలు నిర్వహించేందుకు ఎంజీఎం మైదానం ఇవ్వడానికి సాధ్యం కాదని విషయాన్ని రాతపూర్వకంగా ఇవ్వాలని టిడిపి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంజిఎం హై స్కూల్ గ్రౌండ్‌లో వేడుకలు నిర్వహించడానికి అనుమతి లేదంటూ ఇన్‌ఛార్జి కమిషనర్ ఆనంద్ కుమార్ లిఖితపూర్వకంగా ఇచ్చారు. అనంతరం వారు ఆందోళన విరమించారు.
వేడుకలను నిర్వహించి తీరుతాం
బాలయ్య అభిమానులు, టిడిపి నాయకులు
బాలకృష్ణ నటించిన వీరసంహారెడ్డి సినిమా శతదినోత్సవ వేడుకలను హిందూపురంలో నిర్వహించి తీరుతామని టిడిపి నాయకులు, బాలయ్య అభిమానులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టిడిపి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, బాలకష్ణ అభిమానుల సంఘం జాతీయ కన్వీనర్ నంబూరి సతీష్ కుమార్, టిడిపి పట్టణ అధ్యక్షులు రమేష్ కుమార్, సీనియర్ నాయకులు నాగరాజులు విలేకరులతో మాట్లాడుతూ వైసిపి నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎంజీఎం మైదానం ఇచ్చేందుకు కావాలనే అభ్యంతరాలు సృష్టిస్తున్నారని చెప్పారు. ఒక వేళ ఆ ప్రాంతంలో అనుమతి ఇవ్వకున్నా శత దినోత్సవ వేడుకలను అనుకున్న సమయానికి హిందూపురంలోనే మరో ప్రాంతంలో కచ్చితంగా నిర్వహిస్తామని చెప్పారు. వేడుకల కోసం మైదానం ఇవ్వమని అంటున్న అధికారులు గత పది రోజుల క్రితం వైసీపీ ప్రభుత్వం ఆసరా కార్యక్రమం చేసినప్పుడు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. స్థానిక శాసన సభ్యులు బాలకష్ణ నిర్వహించే కార్యక్రమానికే మున్సిపల్ అధికారులు ఇలా చేస్తే సామాన్యులకు సుపరిపాలన ఎలా అందిస్తారన్నారు. మున్సిపల్ అధికారులు నిరాకరించిన లేఖ ద్వారా కోర్టుకు వెళుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాలకష్ణ అభిమాన సంఘం నాయకులు హెచ్‌ఎన్.రాము, కౌన్సిలర్‌లు రాఘవేంద్ర, సతీష్ కుమార్, లీగల్ సెల్ కన్వీనర్ శివకుమార్, టిడిపి నాయకులు అమర్నాథ్, నజీర్, మోద శివకుమార్, చంద్రశేఖర్, రామాంజినమ్మ, పరిమళ, వెంకటేష్, బాలయ్య అభిమానులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.










