May 11,2023 22:06

పెన్నానది నుంచి ట్రాక్టర్ల తరలిపోతున్న

         హిందూపురం : హిందూపురం ప్రాంతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు యథేచ్ఛగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. పట్టపగలే రెచ్చిపోయి పెన్నానదిలో ఇసుకను అక్రమంగా రవాణ చేస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన సెబ్‌, ఫోలీస్‌, రెవెన్యూ అధికారులు ఇసుక మాఫియా ఇచ్చే మామూళ్ల మత్తులో తులతూగుతున్నారు. సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ఓ బండి ఇసుక దొరకని పరిస్థితి ఉంది. అయితే అధికార పార్టీ నేతలు మాత్రం వందలాది ట్రాక్టర్లను పెన్నానది నుంచి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
హిందూపురం మండల పరిధిలోని బీరేపల్లి పంచాయతీ సెక్రటరీ విజరు అనే వ్యక్తికి సంతకాలు చేసి మలుగూరు నుంచి పూలకుంటకు ఇసుక తరలింపునకు అనుమతులు ఇచ్చారు. ఈ లేఖను చూపి హిందూపురం సమీపంలోని పెన్నానది నుంచి ఇసుకను తరలిస్తున్నారు. ఇదంతా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోంది. అనుమతుల లేఖ పొందిన వ్యక్తి అధికార పార్టీ జెడ్పీటీసీ సోదరుని కుమారుడు, వైసిపి నాయకుడు కావడం గమనార్హం. బీరేపల్లి పంచాయతీ సెక్రటరీ సంతకంతో విజరు తీసుకున్న లేఖతో ఏకంగా పెన్ననదిలో ప్రతి రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్లను పెట్టి పట్టణంలోని హౌసింగ్‌ బోర్డు, టీచర్స్‌ కాలనీ తదితర ప్రాంతాలకు ఇసుకను సరఫరా చేసి సోమ్ము చేసుకుంటున్నారు. ఇసుక అక్రమ రవాణా కోసమే బేవినహళ్లి, సడ్లపల్లి ప్రాంతాల్లో పదుల సంఖ్యలో అక్రమ ఇసుక వ్యాపారులు ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. వీరందరూ పగలు అనుమతులు పేరుతో, రాత్రి అనుమతులు లేకుండానే 24 గంటలూ ఇసుకను పెన్నానది నుంచి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
వైసిపి అధికారంలో మరింత దోపిడీ
వైసిపి అధికారంలోకి వచ్చాక హిందూపురం నియోజకవర్గంలో ఇసుక మాఫియా మరింత రెచ్చిపోతోంది. ఇసుక మాఫియాను అరికట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నూతన ఇసుక పాలసీ విధానాన్ని తీసుకువచ్చింది. ఇసుక అవసరం ఉన్న ప్రతి ఒక్కరూ సంబంధిత వెబ్‌సైట్‌ ద్వారా ఇసుక బుక్‌ చేసుకుని, ప్రభుత్వం సూచించిన వాహనంలో తీసుకుపోవాల్సి ఉంది. దీంతో ప్రభుత్వనికి ఆదాయంతో పాటు అవసరం ఉన్నా వారికి ఇసుకను అందించడానికి అవకాశం ఉంది. హిందూపురం మండలంలో ఇసుక అక్రమార్జనే ధ్యేయంగా అలవాటు పడిన కొందరు రాత్రీపగలూ అన్న తేడా లేకుండా పెన్నానదిలో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. పట్టణమే కాకుండా, పక్కన ఉన్న కర్నాటక రాష్ట్రనికి సైతం ఇసుకను తరలించి కోట్లు సంపాదిస్తున్నారు. అక్రమార్కుల పరిస్థితి ఇలా ఉంటే సామాన్యులు మాత్రం ఇసుకదొరక్క నానావస్థలు పడుతున్నారు. ఇంటికోసం ఇసుకను తరలిస్తే సెబ్‌, ఫోలీస్‌ అధికారులు టక్కున దాడులు చేసి వారిపై జరిమానాలు విధిస్తున్నారు. అధికార పార్టీ నేతలు పట్టపగలే దర్జాగ ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. అక్రమ ఇసుక రవాణా గురించి ఆయా ప్రాంత రైతులు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారిపై చర్యలు తీసుకోకుండా మరింత ఎక్కువ మాముళ్లు తీసుకుని వెళ్తున్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
పడిపోతున్న భూగర్భ జలాలు
గతంలో ఇసుక వ్యాపారులు పెన్నానదిలో ఉన్న ఇసుకను పూర్తిగా కనమరుగు చేశారు. రెండు సంవత్సరాలుగ కురుస్తున్న వర్షాలతో పెన్నా ఏరు బాగా పారింది. దీంతో ఇసుక ఎక్కువగా చేరింది. దీంతో భూగర్భ జలాలు పెరిగి, రైతుల బోరు బావుల్లో నీళ్లు సంవృద్ధిగా చేరాయి. ఈ పరిస్థితి ఎక్కువ రోజులు ఉండకనే అక్రమ ఇసుక రవాణాతో మళ్లీ భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం నెలకొంది. బోరుబావి తవ్విస్తే నీరు పడడమే కష్టంగా ఉంది. హిందూపురం పరిసర ప్రాంతాల్లో దాదాపు 1200 అడుగులు బోరు వేసినా నీరు పడని పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో పంటల సాగు కోసం రైతులు బోరుబావులు తవ్విస్తే అప్పులపాలు అవుతున్నారు. పెన్నానదిలో ఇసుకను అక్రమంగా తరలించడమే ఈ పరిస్థితికి కారణం అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు రైతుల ఇబ్బందులను గుర్తించి పెన్నా నదీ పరివాహక ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.