హిందూపురం : హిందూపురంలో ఫ్లెక్సీ వివాదం రెండు రోజులుగా రచ్చ కెక్కింది. శుక్రవారం రాత్రి రహమత్‌పురం సర్కిల్‌లో సిఎం జగన్ ఫొటోతో పేదలకూ పెత్తందారులకు యుద్ధం అనే స్లోగన్‌తో వైసిపి నాయకులు ఓ ప్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీపై టిడిపి, జనసేన నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసులు వెంటనే స్పందించి ముగ్గురు టిడిపి నాయకులు, 7 మంది జనసేన నాయకులను అరెస్టు చేశారు. వారిని శనివారం కోర్టుకు హాజరు పరచడంతో వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉండగా వైసిపి నాయకులు ఫ్లెక్సీలను చింపేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇంద్రజ, సీనియర్ నాయకులు కొండురు వేణుగోపాల్ రెడ్డిల ఆధ్వర్యంలో వేలాది మంది వైసిపి నాయకులు పెద్దఎత్తున పట్టణంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్‌లో అంబేద్కర్ విగ్రహానికి, సిఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం అక్కడ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం రాజధానిలో పేదలకు ఇంటి పట్టాలను అందిస్తుంటే టిడిపి, జనసేన అడ్డుకోవడం తగదన్నారు. హిందూపురం టిడిపి, జనసేన నాయకులకు ధైర్యం ఉంటే నేరుగా ఎంజిఎం మైదానంలోకి వస్తే తేల్చుకుందామని ఛైర్‌పర్సన్ సవాల్ విసిరారు. ప్రశాంతంగా ఉన్నా హిందూపురంలో ఆశాంతిని రేపాలని చూస్తే సహించే ప్రశక్తే లేదన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ జబివుల్లా, లేపాక్షి మండలం కన్వీనర్ నారాయణ స్వామి, జడ్పీటీసీ బాణాల శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు చాంద్‌బాషా, లతీఫ్ సేట్, సర్పంచులు ఎంపీటీసీలు, కోఆప్షన్ మెంబర్లు పాల్గొన్నారు.
టిడిపి, జనసేన తీరు దుర్మార్గం : నవీన్ నిశ్చల్
ముఖ్యమంత్రి రాజధానిలో పేదలకు ఇంటి పట్టాలను ఇస్తుంటే టీడీపీ, జనసేన పార్టీల నేతలు రాద్దాంతం చేయడం దుర్మార్గమని ఎపి అగ్రోస్ ఛైర్మన్ నవీన్ నిశ్చల్ తెలిపారు. శనివారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పేదలు, పెత్తందార్లకి మధ్య పోరాటం అని వైసిపి నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని టీడీపీ, జనసేన నాయకులు చింపేయడం సరికాదన్నారు. సిఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో దఢసంకల్పంతో కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల అభివద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ప్రజా సమస్యలపై పోరాడకుండా ఫ్లెక్సీలను చింపడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి సంస్కతి హిందూపురంలో ఎప్పుడూ లేదని, దీనిని తీసుకురావొద్దని హితవు పలికారు. భవిష్యత్తులో ఇలాంటి విష సంస్కతి హిందూపురంలోకి రాకుండా అన్ని రాజకీయ పార్టీలు కలిసి ముందుకు రావాలన్నారు. సిఎం జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీని దౌర్జన్యంగా చించివేసిన వారిపై కేసు నమోదు చేసి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్, ఇర్షాద్, డాక్టర్ బాషా, సర్పంచి నాగేంద్ర, నాయకులు వేణురెడ్డి, చంటి, వరుణ్, ప్రమోద్, నటరాజ్ పాల్గొన్నారు.










