May 20,2023 22:42

మున్సిపల్‌ కార్యాలయ ఆవరణంలో కూరగాయలను పారబోస్తున్న వ్యాపారులు

        హిందూపురం : హిందూపురంలో కాయగూరల వ్యాపారులు కన్నెర్ర చేశారు. మున్సిపల్‌ పాలకవర్గం తీరును నిరసిస్తూ పురపాలక సంఘం కార్యాలయం వద్ద శనివారం ఉదయం కూరగాయాలను పారబోసి నిరసన తెలిపారు. పాలకవర్గంకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్బంగా హోల్‌సేల్‌ కూరగాయాల మార్కెట్‌ అసోసియేషన్‌ గౌరవ అద్యక్షులు చాంద్‌బాషా, అధ్యక్షులు షనావాజ్‌, కార్యదర్శి రహీంలు మాట్లాడుతూ హిందూపురం పురపాలక సంఘం ఆధ్వ్వర్యంలో ఉన్న కూరగాయాల మార్కెట్‌ను గత ప్రభుత్వం శిథలం పేరుతో తొలగించిందన్నారు. ఆ సమయంలో అందరికీ న్యాయం చేస్తామని చెప్పి తాత్కాలిక మార్కెట్‌ను పట్టణంలోని రైతు బజార్‌లో ఏర్పాటు చేశారన్నారు. కరోనా నేపథ్యంలో అక్కడి నుంచి ఎంజిఎం మైదానంలోకి మార్చారని చెప్పారు. టిడిపి అనంతరం అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం మార్కెట్‌ నిర్మాణాన్ని పూర్తి చేశారన్నారు. ప్రత్యేక గెజిట్‌ను విడుదల చేసి, మార్కెట్‌ పరిసరాల పరిధిలో 2 కిలో మీటర్ల మేర తోపుడు బండ్లు లేకుండా చూస్తామని, వ్యాపారులకు, ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. సౌకర్యాలు కల్పిసారన్న నమ్మకంతో రూ.16కోట్లు సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించి నూతన మార్కెట్‌లో ఎ, బి బ్లాకులను అద్దెకు తీసుకున్నట్లు చెప్పారు. అయితే మున్సిపాల్టీ అక్కడ సౌకర్యాలు కల్పించలేదన్నారు. దీనికితోడు పక్కన ఉన్న పురపాలక ఖాళీ స్థలాన్ని హోల్‌సేల్‌ వ్యాపారులకు కేటాయిస్తామని మాటను ఇప్పటి వరకు నిలుపుకోలేదన్నారు. మార్కెట్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న తోపుడు బండ్లను సైతం ఖాళీ చేయించలేదన్నారు. ఈ పరిస్థితుల్లో వ్యాపారులు అద్దెకు తీసుకున్న గదులకు సైతం అద్దెలు చెల్లించిన దుస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరిస్తామని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌తో పాటు వైస్‌ ఛైర్మన్లు, కౌన్సిలర్లు ఛైర్‌పర్సన్‌ లెటర్‌ ప్యాడ్‌తో ఆరు నెలలు క్రితం లేఖ ఇచ్చారన్నారు. ఇప్పటి వరకు దీనికి అతీగతిలేదన్నారు. కౌన్సిల్‌లో తమ సమస్యను అజెండాగా పెట్టి పరిష్కరిస్తామని చెప్పడం తప్పా ఆచరణలో చేసింది శూన్యం అన్నారు. తమకు స్థలాన్ని కేటాయించి, న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని వ్యాపారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న వ్యాపారుల వద్దకు మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమోద్‌కుమార్‌ వచ్చి అందరికీ న్యాయం చేస్తామని ఆందోళన విరమించాలని కోరారు. అయితే వ్యాపారులు వెంటనే సమావేశాన్ని ఏర్పాటు కూరగాయల వ్యాపారులకు స్థలం కేటాయించే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రశక్తే లేదని తెల్చి చెప్పారు. చివరకు వైస్‌ ఛైర్మన్‌ జబీవుల్లా అక్కడికి వచ్చి వచ్చే సమావేశంలో ఈ అంశాన్ని పెట్టి న్యాయం చేస్తామని, ఆందోళన విరమించాలని కోరారు. దీనికి వ్యాపారులు ఒప్పుకోలేదు. ఇలా దాదాపు మూడు గంటలకు పైగా ఆందోళన కొనసాగింది. చివరకు ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ ఫోన్‌ చేసి వ్యాపారులతో మాట్లాడారు. హోల్‌సేల్‌ వ్యాపారులకు స్థలాలను కేటాయించే విధంగా చూస్తామని, ఈ నెల 30న జరిగే కౌన్సిపల్‌ సమావేశంలో ఈ అంశం వచ్చే విధంగా చూసి, అందరికి స్థలాలను కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో అసోషియేషన్‌ నాయకులు రఫీక్‌, బాల, జిపికె మంజు, రిజ్వాన్‌, బాబా, నస్రూ తదితరులు పాల్గొన్నారు.