Jul 11,2023 21:36

శస్త్ర చికిత్సపై వివరాలను వెల్లడిస్తున్న వైద్యులు

       హిందూపురం : సుమారు 90 సంవత్సరాల వయస్సు గల వృద్ధురాలికి అరుదైన శస్త్ర చికిత్సను హిందూపురం జిల్లా ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్బంగా మంగళవారం నాడు జిల్లా అసుపత్రిలో మెడికల్‌ సుపరిటెండెంట్‌ రోహిల్‌ కుమార్‌, శస్త్ర చికిత్స వైద్య నిపుణులు శివ ప్రసాద్‌ నాయక్‌లు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పట్టణంలోని అనాథశరణాలయంలో ఉంటున్న సుమారు 90 సంవత్సరాల వయస్సుల గల హనుమక్క గత నెల 15వ తేదీన ఎడమ చేయి పెరిఫెరల్‌ వ్యాస్కులార్‌ (రక్త నాళలలో రక్తం సరఫరా నిలచిపోవడం) వ్యాధితో బాధ పడుతూ ఆసుపత్రికి వచ్చింది. అన్ని పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెను అసుపత్రిలో అడ్మిట్‌ చేసుకుని అదే నెల 17వ తేదీన మోచేయి పైభాగం వరకు శస్త్ర చికిత్స ద్వారా తొలగించారు. వయస్సు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆమెకు శస్త్ర చికిత్స చేయించేందుకు మొదట అందరూ అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రముఖ అనస్థీషియా డాక్టర్‌ క్రిష్ణసాగర్‌ ధైర్యం చేసి మత్తు మందు ఇవ్వాడానికి ముందుకు వచ్చారు. తరువాత వైద్యులు విజయవంతంగా ఆమెకు శస్త్ర చికిత్సను చేశారు. శస్త్ర చికిత్స సమయంలో సిబ్బంది రాజు, శీను, నిర్మల వైద్యులకు సహాకారం అందించారు. గత 23 రోజులుగా ఆమెను ఆసుపత్రిలోనే ఉంచుకుని పూర్తి స్థాయిలో వైద్యసేవలు అందించారు. ప్రస్తుతం ఆమె కోలుకున్నారు. 90 ఏళ్ల వృద్ధురాలికి అరుదైన శస్త్ర చికిత్స చేయడం, అది విజయవంతం కావడంపై వైద్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు ఆర్‌ఎంఒ రుక్మిణమ్మ, జనరల్‌ సర్జన్‌ డేవిడ్‌ రాజు పాల్గొన్నారు.