Sep 17,2023 18:33

సెలవు రోజుల్లోనూ పని ఒత్తిడి
ప్రజాశక్తి - బుట్టాయగూడెం
   పులిరామన్నగూడెం విఆర్‌ఒ కోటం బాలరాజు అస్వస్థకు గురై కళ్లు తిరిగి పడిపోవడంతో తోటి సిబ్బంది ఆయనను హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. బుట్టాయగూడెం మండలంలోని విఆర్‌ఒలు, సచివాలయ సిబ్బంది, తహశీల్దార్‌ కార్యాలయంలో ఇంటి నెంబర్లు సున్నా ఉన్న వాటి వివరాలు, సవరణలు, రానున్న ఎలక్షన్‌లు దృష్టిలో పెట్టుకొని ఓటరు జాబితాల వెరిఫికేషన్‌ విధులు నిర్వహిస్తూ ఉండగా పులిరామన్నగూడెం విఆర్‌ఒ అస్వస్థతకు గురయ్యారు. ఆ విధంగా పడిపోవడాన్ని చూసి తోటి సిబ్బంది ఆయన చనిపోయారేమోననే భయానికి గురయ్యారు. గత కొద్ది రోజులుగా విఆర్‌ఒలు, సచివాలయ సిబ్బందిపై పని భారం, పని ఒత్తిడి ఎక్కువైనట్టు కనిపిస్తుంది. రెండవ శనివారం, కృష్ణాష్టమి, ఆదివారం వరుసగా సెలవులు రాగా విఆర్‌ఒలు, సచివాలయ సిబ్బంది చేత ఇటువంటి సెలవు రోజులలో కూడా పని చేయించడం వలన అనారోగ్యంతో అస్వస్థతకు గురైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఏజెన్సీ మండలం కావడంతో మారుమూల గ్రామాలలో సిగల్‌ సమస్య ఉండడం వలన పనులు అనుకున్నంత సమయానికి జరగకపోవచ్చు. పైఉన్నతాధికారులు పని త్వరగా జరగాలని చెప్పడంతో, సెలవు రోజులలో కూడా పనిచేయడం వలన త్వరగా పని అయిపోవాలని, ఉన్నతాధికారుల ఒత్తిడితో అధికారులు అస్వస్థకు గురవుతున్నారని తెలుస్తుంది.