- కృష్ణా జిల్లా టిడిపి అధ్యక్షుడు, కొనకళ్ళ నారాయణరావు
ప్రజాశక్తి-కలక్టరేట్(కృష్ణా) : నూతనంగా జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన పి రాజబాబు పట్టాభి స్మారక భవన నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని బందరు మాజీ పార్లమెంటు సభ్యులు టిడిపి, జిల్లా అధ్యక్షుడు, కొనకళ్ళ నారాయణరావు కోరారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణ సాధన సమితి సభ్యులు ఆదివారం బందరు మాజీ పార్లమెంటు సభ్యులు, కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, కొనకళ్ళ నారాయణరావు ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి పాలకులు సృష్టిస్తున్న అడ్డంకులను తెలియజేస్తూ వినతి పత్రం, కరపత్రమును అందజేశారు. ఈ సందర్భంగా నారాయణరావు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకుడు స్వర్గీయ భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి మచిలీపట్నంలోని వైసీపీ పాలకులు అవరోధాలు కల్పిస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంకులో విలీనమైనప్పటికీ యూనియన్ బ్యాంక్ అధికారులు ముందుకు వచ్చి పట్టాభి స్మారక భవన నిర్మాణానికి 40 కోట్లు ఇచ్చేందుకు ముందుకు రావడం ముదావాహం అన్నారు.భవన నిర్మాణానికి జిల్లా కలెక్టర్ రెండు ఎకరాల స్థలం ఇచ్చారని, అయితే మచిలీపట్నం నగర కార్పోరేషన్ వారు అనుమతులు ఇచ్చేందుకు తాత్సారం చేయడం సిగ్గు చేటన్నారు. ఇలా జాప్యం చేయడం వల్ల నిధులు సకాలంలో వినియోగించే అవకాశం లేకుండా పోతుందన్నారు. దీనిపై కొత్తగా పదవీ బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ పి రాజబాబు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.ఈ సమస్య మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలోకి కూడా వెళ్లిందని చంద్రబాబు సైతం మచిలీపట్నంకు వచ్చిన సందర్భంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు అన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ పి రాజబాబు పట్టాభి స్మారక భవన నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించి, బందరు ప్రజల చిరకాల వాంఛ అయిన పట్టాభి స్మారక భవన నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ఈ ఉద్యమానికి పట్టాభి అభిమానులు, ఆంధ్ర బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగులు అందరూ కూడా పార్టీలకతీతంగా ఉద్యమంలో పాల్గొని పట్టాభి స్మారక భవన నిర్మాణానికి పట్టాభి స్మారక భవన నిర్మాణ సాధన సమితి సభ్యులు చేసే ఉద్యమానికి పూర్తి మద్దతు తెలియజేయాలి అని బందరు మాజీ పార్లమెంటు సభ్యుడు కొనకళ్ళ నారాయణరావు కోరారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కొనకళ్ళ జగన్నాధ రావు(బుల్లయ్య), పట్టాభి స్మారక భవన నిర్మాణ సాధన సమితి సభ్యులు, వేమూరి రామకృష్ణారావు, పిఎస్ఎస్ ఆర్ శర్మ, పివి ఫణికుమార్, కె వెంకట కృష్ణారావు, సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.










