ప్రజాశక్తి-హిందూపురం : రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్నా పట్టు రైతులకు ఇవ్వాల్సిన ప్రోత్సహకాన్ని వెంటనే విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహదారులు సజ్జల రామకృష్ణారెడ్డిని పట్టు రైతు సంఘం నాయకులు, రైతులు కోరారు. మంగళవారం అమరావతిలో సజ్జలను కలిసిన నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా పట్టు రైతు సంఘం నాయకులు సిద్దారెడ్డి, జయరాం రెడ్డి మాట్లాడుతు 2019 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పట్టు రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రోత్సాహ బకాయిలు దాదాపు రూ.50కోట్ల వరకు ఉందన్నారు. ఈ మొతాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు రేషం షెడ్లకు, రోగ నిరోధక మందులకు, పరికరాలకు, మొక్కలకు ఇవ్వాల్సిన సబ్సిడీ మొత్తం విడుదల చేయాలన్నారు. రాష్ట్రంలోనే అతి పెద్ద మార్కెట్ అయిన హిందూపురం పట్టు గూళ్ల మార్కెట్ భవనం శిథిలావస్థకు చేరుకుందని దీని స్థానంలో కొత్త భవనం నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాక జిల్లాలో పట్టు పరిశ్రమ అభివృద్ధి కోసం జిల్లాకు ప్రత్యేక కమిషనర్‌ను నియమించాలన్నారు. తమ డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతు సమస్యలను ముఖ్యమంత్రికి తెలిపి ప్రోత్సాహక మొత్తాన్ని విడుదల చేయించే విధంగా చూస్తానని హామీ ఇచ్ఛారన్నారు. మిగిలిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టు రైతు సంఘం నాయకులు రాజేష్, శంకర, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.










