Jun 12,2023 22:16

సమావేశంలో మాట్లాడుతున్న ప్రభాకర్‌రెడ్డి

ప్రజాశక్తి-హిందూపురం : రాష్ట్ర వ్యాప్తంగా పట్టు, పాడి రైతులకు ఇవ్వాల్సిన ప్రోత్సాహక సబ్సిడీని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పట్టు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం పట్టణంలోని పట్టుగూళ్ల మార్కెట్‌లో జిల్లా పట్టు రైతుల సమావేశం జిల్లా ప్రదాన కార్యదర్శి బాల సుబ్బిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ధనాపురం వెంకటరామిరెడ్డి, ప్రభాకర్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు వ్యవసాయాన్ని వదిలి పట్టణ ప్రాంతాలకు వలసలు వెళ్లి కూలి పని చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఉమ్మడి అనంత జిల్లాలో పట్టు రైతులకు సుమారు రూ.15కోట్లు ప్రోత్సాహక సబ్సిడీ విడుదల కావాల్సి ఉందన్నారు. దీనిని విడుదల చేయాలని గత నాలుగు సంవత్సరాలుగా స్థానిక అధికారుల నుంచి రాష్ట్ర అధికారులతో పాటు మంత్రులను, ప్రభుత్వ సలహాదారులను కలిసి వివరించినప్పటికి ఇప్పటికి విడుదల చేయలేదన్నారు. జిల్లాలో పట్టు తర్వాత ప్రధన పంట వేరు శెనగ పంట అన్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న వేరుశనగ నాణ్యతగా లేదన్నారు. దీంతో పాటు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ సైతం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ధర ఎక్కువ ఉండడంతో రైతులు కొనుగోలు చేయడానికి సుముఖంగా లేరన్నారు. ఇక పాడి రైతులకు లీటరు పాలుకు రూ.4 ప్రోత్సాహక ఇన్‌సెటీవ్‌ ఇస్తామని ప్రభుత్వం చెప్పి నాలుగు సంవత్సరాలుగా ఒక్క పైసా కూడా విడుదల చేయలేదన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతుల సమస్యలపై ఈనెల 19 నుంచి 23 వరకు ఆర్‌బికెల వద్ద ధర్నాలు, నిరసనలు చేపడుతామన్నారు. అప్పటికి ప్రభుత్వం స్పందించక పోతే ఈ నెల 30న చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జంగాలపల్లి పెద్దన్న, బడాసుబ్బిరెడ్డి, హరి, సిద్ధారెడ్డి, సోమశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.