Sep 10,2023 21:51

ముంపునకు గురైన పట్టణానికి శివారునున్న కాలనీ (ఫైల్‌)

పార్వతీపురంటౌన్‌ : జిల్లా కేంద్రమైన పార్వతీపురం పట్టణాన్ని వరద ముప్పుడు వీడడం లేదు. భవిష్యత్తులో పట్టణం జలదిగ్బంధం బారినపడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి పట్టణంలో గల లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధాన రహదారి, పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చిన్నపాటి వర్షానికే పట్టణ పరిస్థితి ఇలా ఉంటే 3,4 రోజులు కురిసే భారీ వర్షాలకు, తుఫాన్‌ సమయంలో పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనని లోతట్టు, వరహాల గెడ్డ పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎగువన భారీ వర్షం పడితే వరహాల గెడ్డ పొంగి పొర్లే సందర్భాలు ఉన్నాయి. దీనివల్ల లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీలు జలమయమవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం పట్టణానికి చుట్టుపక్కల ప్రాంతాల్లోని వ్యవసాయ భూములు నివాస ప్రాంతాలుగానూ, లేఅవుట్టుగానూ మారిపోతున్నాయి. ఈ పొలాల గుండా ఎన్నో ఏళ్లుగా ప్రవహించే సాగునీటి కాలువలను, కల్వర్టులను, మదుములను కప్పేసి లేఅవుట్లుగా మార్చేశారు. సిసి కాలువలు, రోడ్లు, పార్క్‌లు, కల్వర్టులు వంటి సదుపాయాలను నిర్మించకుండా స్థలాలను అమ్మకాలు చేయడంతో వాటిని కొనుగోలు చేసేవారు కూడా అవేవీ పట్టించుకోకుండా ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా గృహ, వాణిజ్య సముదాయాలు, అపార్ట్మెంట్‌ నిర్మాణాలు జరిగిపోయాయి. ఆ సమయంలో సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నివాస గృహాల వాడుకనీరు బయటకు పోయేందుకు దారిలేకపోవడంతో పాటు, వర్షపు నీరు వెళ్లేందుకు అవకాశం ఉండడం లేదు. దీంతో ఈ ప్రాంతాలు ప్రతి ఏటా వర్షాకాలంలో ముంపునకు గురవుతున్నాయి. పట్టణానికి చెందిన నివాస గృహాల వాడుక నీరు, వర్షపు నీరు ప్రధాన రహదారి కాలువ గుండా వేణుగోపాల్‌ థియేటర్‌ వద్ద ఉన్న వరహాల గెడ్డలోకి చేరాల్సింది. అయితే ఈ వరహాలగెడ్డ ప్రధాన రహదారి గుండా బైపాస్‌ కాలనీ నుంచి రైల్వే పట్టాల కింద ఉన్న ఏడు ఖానాల ద్వారా వ్యవసాయ భూముల పక్క నుండి ప్రవహించి పట్టణ శివారు ప్రాంతంలో ఉన్న రాళ్లగెడ్డ లో కలుస్తుంది. వర్షాకాలంలో పార్వతీపురం పట్టణానికి ఉన్న ఎగువ ప్రాంతంలోని, పట్టణంలోని భారీ వర్షం కురిసినప్పుడు వరహాలగెడ్డలో వరద నీరు ఎక్కువగా పోటెత్తి పొంగిన సందర్భంలో వరద నీటి ప్రవాహం చుట్టుపక్కల ఉన్న లోతట్టు ప్రాంతాలను ముంపునకు గురిచేస్తున్న సందర్భాలు కోకొల్లలు. ఇలాంటి సందర్భాల్లో స్థానిక ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, నానా ఇబ్బందులు పడే సందర్భాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఈ ముంపు సమస్య మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంటుందని పట్టణవాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కావున లక్ష్మీనారాయణ పురం నుంచి ఉన్న వరహాల గెడ్డ పరీవాహక ప్రాంతాలను వెడల్పు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు భావిస్తున్నారు. ఈ దిశగా రెవెన్యూ, ఆర్‌ అండ్‌ బి, ఇరిగేషన్‌, మున్సిపల్‌ అధికారులు యుద్ధ ప్రాతిపదికలు ప్రణాళికలు సిద్ధం చేసి, పనులు ప్రారంభించి పట్టణాన్ని ముంపు భారీ నుండి రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వరద ముప్పు తప్పేదెప్పుడో?
పార్వతీపురంరూరల్‌ : ఆంధ్రా-ఒడిషాల సరిహద్దు ప్రాంతాల్లో ఏమాత్రం వానలు కురిసినా వరదనీరు పార్వతీపురం పట్టణంతో పాటు, మండల ప్రజలకు కంటిమీది కునుకులేకుండా చేస్తుంది. ప్రతి ఏటా వర్షాకాలంలో పట్టణంలోని బైపాస్‌కాలనీ, బిఎన్‌బిరావు క్వార్టర్స్‌, శతృచర్ల కాలనీలకు చెందిన ప్రజలు బెంబేలేత్తుతున్నారు. అలాగే పుట్టూరు, లచ్చిరాజుపేట మధ్యగా ప్రవహించే సాకిగెడ్డ వరదనీరు భారీ ఎత్తున ప్రధాన రహదారిపై ప్రవహించడంతో గంటల కొద్దీ రాకపోకలకు అంతరాయం కలగడమే కాకుండా, పంటపొలాలు నీటమునిగి రైతులకు కంటనీరు పెట్టిస్తున్నాయి. ఏళ్లతరబడి ఈ సమస్య ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారుతున్నప్పటికీ పట్టించే నాధుడే లేడు. ఈనెల 6న రికార్డు స్ధాయిలో 84 మిల్లిమీటర్ల వర్షానికి సాకిగెడ్డతో పాటు, వరహాల గెడ్డ ఉధృతంగా పొంగి, తమ ప్రతాపాన్ని చూపించాయి. ఎప్పటిలాగే పుట్టూరు పరిసర ప్రాంతాల్లో పంటలు నీటిలో మునిగిపోగా, రాత్రంతాగా రహదారిపై నీరుచేరి 45 గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరహాలు గెడ్డ పొంగి జనశక్తి కాలనీ, రాజీవ్‌కాలనీ, బైపాస్‌కాలనీ, సౌందర్య దియోటర్‌ రహదారి, శతృచర్ల కాలనీ, పట్టణ శివారు గెడ్డవీధితో పాటు పలు ప్రాంతాలు నీటమునిగాయి. ఆ సమయంలో అధికారులు, పాలకులు వరదనివారణ చర్యలు చేపట్టి బాధితులను ఆదుకున్నప్పటికీ ఇది కేవలం తాత్కాలిక ఉపశమనమేనని ఆయా ప్రాంత ప్రజలు వాపోతున్నారు. ప్రతిఏటా చేదు అనుభవాన్ని మిగులుస్తున్న సాకిగెడ్డ, వరహాలగెడ్డ పరివాహక ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ముంపు బారి నుంచి తమను రక్షించాలని కోరుతున్నారు. అంతేకాక ఈరెండు గెడ్డలు పూర్తిగా పూడికలతో నిండిపోవడమే కాకుండా, ఎక్కడికక్కడ ఆక్రమణలకు గురికావడంతో ప్రవాహం ధాటిపెరిగి పరిసర ప్రాంతాల్లోకి వరదనీరు చొచ్చుకు వచ్చేస్తుంది. కావున వర్షాకాలానికి ముందుగానే పూడికలు తీయించడం, సాకిగెడ్డ డిజైన్‌మార్చి ఎత్తును పెంచి, కొత్తగా నిర్మాణం చేపట్టడంతో పాటు, వృథాగా పోతున్న వరదనీటిని నిల్వచేయడంకానీ, జంఝావతి కాలువకు మళ్లించి, రైతులకు ఉపయోగకరంగా ఉండేలా చర్యలు చేపట్టాలని అటు పట్టణ, మండల ప్రజలు కోరుతున్నారు.