ప్రజాశక్తి-ఆదోనిరూరల్
పట్టణ ప్రజల నీటి దాహార్తిని తీర్చాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జీ బోయ నీలకంఠప్ప కోరారు. సోమవారం స్పందనలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీకి అధికారుల నిర్లక్ష్యం వల్ల పట్టణ ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పట్టణంలో 42 వార్డులకు తాగునీటిని సరఫరా చేసేందుకు 2004లో బసాపురం గ్రామం వద్ద సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మించారని చెప్పారు. ప్రస్తుత ఆదోని మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వల్ల కొన్ని సంవత్సరాల క్రితం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు పగుళ్లు వచ్చి నీరు లీక్ కావడం తద్వారా తాగునీరు వృథా అవుతోందని తెలిపారు. అధికారులు సకాలంలో మరమ్మతులు చేపట్టకపోవడంతో నేడు పట్టణ ప్రజలకు వారానికోసారి తాగునీటిని అందిస్తున్నారని మండిపడ్డారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు చుట్టూ ఉన్న శ్లాబ్‌లు పగులు వచ్చి ఊడి నీరు వృథాగా పోతున్నా చుట్టూ ఉన్న ప్రాంతాలు నీటిమయం కావడంతో పంట పొలాల్లోకి వెళ్లి రైతులకు ఇబ్బందిగా మారిందన్నారు. అధికారులు నిర్లక్ష్యం వహించడంతో నీటి కష్టాలు ఇప్పట్లో తీరేలా కనబడడం లేదన్నారు. రూ.లక్షల్లో ఖర్చు పెడుతూ నాణ్యమైన పనులు చేపట్టకుండా ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని వాపోయారు. కలెక్టర్ స్పందించి అధికారులపై విచారణ చేపట్టి, యుద్ధప్రాదిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు. పట్టణ కార్యనిర్వహణ అధ్యక్షులు దిలీప్ ఢోకా, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మారుతి రావు, కాంగ్రెస్ కార్యదర్శి సాయినాథ్, యువజన నాయకులు దేవిశెట్టి వీరేష్, శ్రీనిత్, రాము పాల్గొన్నారు.
అధికారులకు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు










