పట్టాభి స్మారక భవనాన్ని నిర్మించి తీరుతాం: ఎంపి
ప్రజాశక్తి - మచిలీపట్నం అర్బన్
ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, స్వాతంత్ర సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య జ్ఞాపకార్థం ప్రజలకు ఉపయోగపడేలా కన్వెన్షన్ హాల్, మ్యూజియం, లైబ్రరీ నిర్మించి తీరుతామని బందరు పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి అన్నారు. పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణ సాధన సమితి సభ్యులు శనివారం మచిలీపట్నం ఆర్ అండ్ బి గెస్ట్ అతిథి గృహంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ పట్టాభి స్మారక భవన నిర్మాణం గూర్చి ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌లతో తాను మాట్లాడానన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సష్టించినా త్వరలోనే స్మారక భవన నిర్మాణ పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. సాధన సమితి సభ్యులు మాట్లాడుతూ జిల్లా కలెక్టరుకు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని వాపోయారు. అనంతరం సభ్యులు వేమూరి రామకృష్ణారావు, ఏఆర్కే మూర్తి, మోపర్తి సుబ్రమణ్యంలు ఎంపి బాలశౌరికి వినతి పత్రం అందజేశారు.










