ప్రజాశక్తి-చింతూరు
2013 మార్చి 10న మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన సిపిఎం నాయకులు పట్రా ముత్యం ఆశయ సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆ పార్టీ నాయకులు అన్నారు. మండలంలోని తుమ్మల గ్రామంలో పట్రా ముత్యం స్థూపం వద్ద ఆయన వర్థంతి కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. సిపిఎం మండల కార్యదర్శి సీసం సురేష్, నాయకులు కుంజ సీతారామయ్య, పల్లపు వెంకట్, ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మొట్టుమ్ రాజయ్య అధ్యక్షతన జరిగిన సభలో సిపిఎం మండల కార్యదర్శి సీసం సురేష్ మాట్లాడుతూ పట్రా ముత్యం ఈ ప్రాంత ప్రజలతో మమేకమె,ౖ గిరిజనులను ఐక్యం చేసి వారి సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించారని తెలిపారు. చెక్కుచెదరని ఆయన క్రమశిక్షణను సహించలేని మావోయిస్టులు ముత్యంను ఇంటి నుంచి తీసుకువెళ్లి హత్య చేశారని పేర్కొన్నారు. హత్యలతో పార్టీ అభివృద్ధిని అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే సాగునీటి వనరులను అభివృద్ధి చేయాలని, విద్య వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని తెలిపారు. వీటిని సాధించడమే ముత్యంకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముత్యం కుటుంబ సభ్యులు పట్రా రమేష్, జయమ్మ, ముట్టు నాగేశ్వరరావు, ఠాగూర్, లెనిన్ తదితరులు పాల్గొన్నారు.










