పసుపు కొనుగోలు కేంద్రం ప్రారంభం
- రైతులు సద్వినియోగం చేసుకోవాలి
- ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాష్ట్ర మార్కెఫెడ్ చైర్మన్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
నంద్యాల పట్టణంలోని టెక్కె మార్కెట్ యార్డులో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పసుపు కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాష, రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డిలు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పసుపు రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని కనీస మద్దతు ధర కల్పించాలనే లక్ష్యంతో మార్కెట్ ధర కంటే మార్క్‌ఫెడ్ ద్వారా పసుపు క్వింటా రూ.6,850 ధర కల్పిస్తూ రైతులను ఆదుకుంటున్నామని తెలిపారు. బహిరంగ మార్కెట్లో క్వింటా రూ. 4,500 నుంచి రూ. 5 వేలు ఉండగా ప్రభుత్వం మద్దతు ధర రూ. 6850 కల్పించిందన్నారు. నంద్యాల, కర్నూలు జిల్లాల మిర్చి రైతులకు సమీపంలోని నంద్యాల మార్కెట్ యార్డులో మద్దతు ధరకే మిర్చి కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మార్కెఫెడ్ చైర్మన్ మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా ఎపి మార్కెఫెడ్ ద్వారా పసుపు, మొక్కజొన్న, శనగలు రైతుల నుండి మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి మండలంలో, గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఆర్బీకేల ద్వారా వ్యవసాయానికి సంబంధిత సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ రైతులకు అన్ని విధాల అండగా నిలుస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ చిమ్మా నాగన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ నాగరాజు, వ్యవసాయ మార్కెట్ యార్డు సెక్రటరీ కల్పన, యార్డు కమిటీ డైరెక్టర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.










