Sep 21,2023 09:24

శోభయాత్రను అడ్డుకవడంతో సుంకలమ్మ ఆలయం వద్ద నిలిపి ఉంచిన వినాయక విగ్రహం

          పెద్దపప్పూరు : మండల పరిధిలోని పసులూరు గ్రామంలో బుధవారం నాడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వినాయక నిమజ్జనం సందర్భంగా దళితులు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని గ్రామంలోని ఆలయం చుట్టూ తిప్పేందుకు పెత్తందారులు అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... పసులూరు గ్రామంలో వినాయక చవితి సందర్భంగా దళితులు వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం నిమజ్జనం సందర్భంగా శోభాయాత్రను చేపట్టారు. ఈ సమయంలో గ్రామంలో మిగతా విగ్రహాలను గ్రామంలోని సుంకలమ్మ ఆలయం చుట్టూ తిప్పి నిమజ్జనానికి తీసుకెళ్లారు. ఆ విగ్రహాల మాదిరే దళితుల కూడా వారి విగ్రహాన్ని సుంకలమ్మ ఆలయం చుట్టూ తిప్పేందుకు వెళ్లారు. ఇందుకు గ్రామంలోని పెత్తందారులు అడ్డుకున్నారు. దళితుల విగ్రహం ఆలయం చుట్టూ తిప్పడానికి వీల్లేదంటూ అడ్డుపడ్డారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దళితులు వారి విగ్రహంతో ఆలయం వద్దనే కూర్చొన్నారు. గ్రామంలో నెలకొన్న ఈ పరిస్థితులను తెలుసుకున్న డీఎస్పీ గంగయ్య వెంటనే సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాల వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేశారు. శాంతియుతంగా నిమజ్జనం నిర్వహించుకోవాలని వారికి సూచించారు. అనంతరం రెండు వర్గాల వారితో మాట్లాడించి పోలీసులు దగ్గరుండి గ్రామంలోని అన్ని విగ్రహాలను చాగల్లు రిజర్వాయర్‌లో నిమజ్జనం చేయించారు.