Oct 27,2023 13:08

ప్రజాశక్తి-మండపేట : డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణంలోని ప్రైవేటు పాఠశాల ఎం.పి.ఎస్ యాజమాన్యం ఆర్థిక లావాదేవీల గొడవలు నేపథ్యంలో గత రెండు రోజుల నుంచి స్కూలుకు తాళాలు పడ్డాయి. ఈ నేపథ్యంలో 1400 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. యాజమాన్యం మధ్య ఆర్థిక లావాదేవీలు దీనికి కారణంగా తెలుస్తుంది. పాఠశాల మూత పడడంతో విద్యార్థులు తల్లిదండ్రులు రోడ్డు ఎక్కారు. విషయం మీడియా ద్వారా జిల్లా అధికారుల ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి కమల కుమారి శుక్రవారం మండపేటకు వచ్చారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆమెను విద్యార్థులు తల్లిదండ్రులు కలిసి పాఠశాలలు తెరిపించాలని తమ చిన్నారుల భవిష్యత్తు కాపాడాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఇప్పటికే తమ చిన్నారుల భవిష్యత్తుపై తమకు ఆందోళన కలుగుతుందని అధికారులు చొరవ తీసుకుని యాజమాన్యం విభేదాలు పక్కన పెట్టి పాఠశాలను తెరిపించి తమ చిన్నారుల చదువు సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై కమలాకుమారి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తాను ఎం.పి.ఎస్ పాఠశాల పరిశీలనకు వచ్చానని రెండు రోజుల్లో పాఠశాల తెరిపించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ మేరకు పాఠశాల యాజమాన్యంతో మాట్లాడుతామని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవలసిన అవసరంలేదని ఆమె భరోసా ఇచ్చారు. ఈమె వెంట డివైఓ నరసింహ ఫణి కుమార్, ఎంఈఓలు నాయుడు రామచంద్రరావు, షాలెం రాజు ఉన్నారు.