ప్రజాశక్తి - పాలకొండ : పర్యావరణాన్ని పరిరక్షించాలని, వన్యప్రాణులను కాపాడాలని ఫారెస్టు రేంజ్ అధికారి కె.తవిటినాయుడు విద్యార్థులకు సూచించారు. వన్యప్రాణి వారోత్సవాలు సందర్భంగా సెక్షన్ బీట్ ఆఫీసర్ కె.రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో వెంకంపేట ఎంపియుపి పాఠశాలలో విద్యార్థులకు ఇటీవల నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి సోమవారం బహుమతులు అందించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌ఒ మాట్లాడుతూ పరిసరాలతో పాటు పర్యావరణాన్ని కాపాడాలన్నారు. అడవులు అంతరించుకుపోవడంతోనే వన్యప్రాణులైన ఏనుగులు, పులులు మైదాన ప్రాంతాల్లోకి వస్తున్నాయన్నారు. వన్యప్రాణులు ఎదురైన సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి.పరాంకుశంనాయుడు, అటవీ అధికారులు రవిబాబు, కె.నీలవేణి, కె.రాజ్యలక్ష్మి, కె.దాలినాయుడు, కుసుమకుమారి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.










