ఓజోన్ పొర ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
ఓజోన్ పొర అత్యంత హానికరమైన అతినీలలోహిత కిరణాల నుంచి భూమిపై గల జీవరాశిని కాపాడుతుందని ప్రిన్సిపల్ డా.కెఎ.రామరాజు తెలిపారు. ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక సిఆర్ రెడ్డి కళాశాలలో 'ఓజోన్ పొర క్షీణత - కారణాలు, నివారణలు' అనే అంశంపై అవగాహనా కార్యక్రమం రసాయన శాస్త్రం, వృక్షశాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. అనంతరం ఓజోన్ పొర ప్రాముఖ్యతపై సామాజిక అవగాహన కల్పించుటకు విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా వ్యవహరించిన ప్రిన్సిపల్ డా.కెఎ.రామరాజు మాట్లాడుతూ భూ ఉపరితలంపై వాతావరణ పొరలు, వాటిలో ఓజోన్ పొర స్థానం, ఈ పొర ఆవశ్యకత, దాని నిర్మాణం, క్షీణతల గురించి సైద్ధాంతికంగా విద్యార్థులకు వివరించారు. ఓజోన్ పొర అత్యంత హానికరమైన అతినీలలోహిత కిరణాల నుంచి భూమిపై గల జీవరాశిని కాపాడుతుందని, కాని మానవ ప్రేరితమైన వాయు కాలుష్యం, క్లోరో ఫ్లోరో కార్భన్ల అధిక వినియోగం వలన, ఈపొర క్షీణిస్తున్నదని దాని వలన అతినీలలోహిత కిరణాల అధిక ప్రభావం సంభవించి మానవులలో చర్మ కాన్సర్లు, కంటి సమస్యలు, జన్యు సమస్యలు తలెత్తడమే కాకుండా జీవ వైవిద్యం కూడ దెబ్బ తింటుందని తెలిపారు. ఓజోన్ పొర క్షీణతకు కారణమైన క్లోరోఫ్లోరో కార్బన్స్, హేలోన్స్, క్లోరిన్, బ్రోమిన్, మిథైల్ క్లోరైడ్, బ్రోమైడ్ల వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఈపొర క్షీణతను తగ్గించి పర్యావరణ సమతుల్యాన్ని కాపాడవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో యుజి కరస్పాండెంట్ డా.కెఎస్.విష్ణుమోహన్, కళాశాల రసాయనశాస్త్ర విభాగాధిపతి విఎఎన్.సతీష్, వృక్షశాస్త్ర విభాగాధిపతి టి.నిహారిక, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.










