పర్యావరణ పరిరక్షణకు కృషిచేయాలి : కలెక్టర్
ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా)
జిల్లాలో పర్యావరణ పరిరక్షణ కోసం స్వచ్ఛభారత్ వంటి పలు కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టేందుకు సంసిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ పి.రాజబాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజితా సింగ్, డిఆర్‌ఒ ఎం. వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో పర్యావరణ పరిరక్షణ, ధాన్యం, మొక్కజొన్న సేకరణ, స్పందన, జగనన్నకు చెబుదాం తదితర అంశాలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు చేపట్టాలని మార్గదర్శకాలు జారీ చేశాయన్నారు. సముద్రతీరాలను పరిశుభ్రంగా ఉంచాలని, గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టాలని, మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు పలు పర్యావరణ హిత కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందన్నారు. ప్రత్యేక పోర్టల్ కార్యక్రమాల ఫొటోలు అప్లోడ్ చేయాలన్నారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే చర్యలను చేపట్టాలన్నారు. ఈనెల 21న మంగెనపూడి సముద్రతీరంలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లాలో గురువారం 125 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోళ్లు జరిగాయన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో దెబ్బతిన్న మొక్కజొన్న, జొన్న పంటల నష్టం వివరాలను నూటికి నూరు శాతం ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు. జిల్లాలో సేకరించిన ధాన్యానికి బిల్లుల చెల్లింపులను మూడు, నాలుగు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఇప్పటివరకు రూ.38 కోట్ల ధాన్యం సేకరణ కోసం రైతులకు చెల్లించారన్నారు. ఇంకా దాదాపు రూ.23 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. గురువారం మచిలీపట్నం డివిజన్లో రూ.2.20 కోట్లు, గుడివాడ డివిజన్లో రూ.1.74 కోట్లు, ఉయ్యూరు డివిజన్లో రూ.70 లక్షలు చెల్లించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసిల్దార్లు తదితర క్షేత్రస్థాయి అధికారులు పాల్గొన్నారు.










