పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
- జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటే బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ కోరారు. సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలోని ఎస్‌బిఐ కాలనీ, చిన్న చెరువు కట్ట గట్టుపై అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించి మానవ జీవనశైలిని ప్రోత్సహించడానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మిషన్ లైఫ్ కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు. జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో నంద్యాల చెరువుకట్ట, ఎస్‌బిఐ కాలనీల్లో జామున్, ఫికస్, మద్ది, మేడి తదితర విభిన్న రకాల అటవీ జాతుల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అనంతరం రోజూ వచ్చే వాకర్‌తో జిల్లా కలెక్టర్ పర్యావరణ ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా అటవీశాఖ అధికారి వినీత్ కుమార్ మాట్లాడుతూ గత నెల రోజుల నుండి అటవీ విశాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 900 కార్యక్రమాలు నిర్వహించామన్నారు. చెరువు కట్ట వెంట ఉన్న కాలిబాటకు నంద్యాల ట్యాంక్ బండ్ అని పేరు పెట్టేందుకు బోర్డుతో పాటు దాదాపు 100 చెట్లను నాటామని తెలిపారు. రోజూ వచ్చే వాకర్స్ ఒక అసోసియేషన్‌గా ఏర్పడి ప్రాంతాన్ని ఆహ్లాదకరంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్‌పి రఘువీర్ రెడ్డి, 36వ వార్డు కౌన్సిలర్, స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సతీమణి నాగినిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, డిఎస్పి మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. డిఎంహెచ్‌ఒ కార్యాలయం ఆవరణలో : జిల్లాలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్.వెంకటరమణ తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డిఎంహెచ్‌ఒ కార్యాలయం ఆవరణలో ఆయన మొక్కలను నాటారు. ఎన్సీడీ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కాంతారావు నాయక్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ మాధవి లత, ఎన్‌టిసీపీ సోషల్ వర్కర్ చిన్న వీరన్న, ఎన్జీవో ప్రతినిధులు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు. నంద్యాల : స్థానిక రామకృష్ణ డిగ్రీ, పిజి కళాశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ రామకృష్ణ విధ్య సంస్థల అధినేత డాక్టర్ జి.రామకృష్ణ రెడ్డి అధ్యక్షత వహించారు. కళాశాల సంచాలకులు జి.హేమంత్ రెడ్డి నేతృత్వం వహించారు. సంస్థ యాజమాన్య కార్య నిర్వాహక అధ్యక్షులు అధిపతి జి.ప్రగతి రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై వివరించారు. అనంతరం కళాశాల వాణిజ్య విభాగాధిపతి శ్రావణి మాట్లాడారు. విద్యార్థినీ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వ్యాసరచన, డ్రాయింగ్, లోగో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. రుద్రవరం : ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని రుద్రవరం అటవీ రేంజి అధికారి శ్రీపతి నాయుడు తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీ క్షేత్ర అధికారి వారి కార్యాలయం ఆవరణంలో డిఎఫ్‌ఒ వినీత్ కుమార్ ఆదేశాల మేరకు రుద్రవరం అటవీ క్షేత్రాధికారి సమక్షంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు నాగరాజు, రాణిమ్మ, బీట్ ఆఫీసర్లు నరసింహారెడ్డి, ఖాన్, అటవీ సిబ్బంది పాల్గొన్నారు. ఆళ్లగడ్డ : పర్యావరణ సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కెవి సుబ్బారెడ్డి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనాథ్ రెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని స్థానిక కేవీ సుబ్బారెడ్డి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. విద్యార్థులతో పర్యావరణ సంరక్షణకై ప్రతిజ్ఞ చేయించారు. కెవి సుబ్బారెడ్డి విద్యాసంస్థల డైరెక్టర్ ఓబన్న పాల్గొన్నారు. అలాగే స్థానిక శాఖ గ్రంథాలయ అధికారి అరుణ ఆధ్వర్యంలో విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. కొలిమిగుండ్ల : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని కొలిమిగుండ్ల ఎస్‌ఐ రమేష్ రెడ్డి తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతంలో ఎస్‌ఐ మొక్కలు నాటారు.










